Husnabad: గజ్వేల్ ఘటనపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం.. పోలీసులకు హెచ్చరిక
Husnabad: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
Husnabad: గజ్వేల్ ఘటనపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం.. పోలీసులకు హెచ్చరిక
Husnabad: సిద్దిపేట జిల్లా గజ్వేల్ కెసిఆర్ క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అమానుషమైన చర్య అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ల ధ్వంసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంత ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోందన్నారు.
తమది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన గుండా రాజ్యాన్ని నడిపిస్తున్నాడని విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం బాధాకరమన్నారు. డిసిసి అధ్యక్షురాలి హోదాలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడడం ఆంక్ష రెడ్డి కి తగదన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని రేవంత్ రెడ్డి ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల పైకి కార్యకర్తలను ఉసిగొల్పడం ఆయన గుండా గిరికి నిదర్శనం అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.




