Vikarabad: కన్న తండ్రిని చంపిన కొడుకు.. కలకలం రేపిన హత్య

Vikarabad: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బాయిమీది తండాలో తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 6:29 PM IST
Vikarabad
X

Vikarabad: కన్న తండ్రిని చంపిన కొడుకు.. కలకలం రేపిన హత్య

Vikarabad: పెద్దేముల్ మండలంలోని బాయిమీది తండాలో తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్య నాయక్, బిక్కి బాయి దంపతులకు ముగ్గురు సంతానం. లోక్య నాయక్ మద్యానికి బానిసై తరచుగా భార్య బిక్కిబాయిని, ఇంట్లోనే ఉంటున్న చిన్న కుమార్తెను వేధిస్తుండేవాడు.

శుక్రవారం లోక్య నాయక్ తన భార్య, కుమార్తెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త వేధింపులు భరించలేక తల్లి బిక్కి బాయి వెంటనే హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న తన కుమారుడు రాథోడ్ సునీల్ నాయక్‌కు తెలిపింది. విషయం తెలుసుకున్న సునీల్ నాయక్ హైదరాబాద్ నుండి స్వగ్రామానికి చేరుకున్నాడు. తన తల్లి, చెల్లెలిని ఎందుకు కొడుతున్నావంటూ తండ్రిని నిలదీశాడు.

దీంతో తండ్రి కొడుకుల మద్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కొడుకు సునీల్ నాయక్ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని తండ్రి మెడ, తల వెనుక భాగంలో బలంగా నరకడంతో లోక్య నాయక్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచాడు.

సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్దన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తండ్రిని హత్య చేసిన సునీల్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story