Karimnagar: లాఠీలతో కొట్టి ఉద్యమాలను ఆపలేరు.. కాంగ్రెస్ సర్కారుకు హెచ్చరిక
Karimnagar: కరీంనగర్ సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
Karimnagar: లాఠీలతో కొట్టి ఉద్యమాలను ఆపలేరు.. కాంగ్రెస్ సర్కారుకు హెచ్చరిక
కరీంనగర్: ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, అరెస్టులు, నిర్బంధానికి పాల్పడిన ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటని, వారికి ఇచ్చిన హామీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర, జిల్లావ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ రూపాల్లో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా మహిళలను లాఠీలతో కొట్టి, గాయపరచడం అమానవీయమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన అనేక హామీలు నేటికీ అమలు కాలేదు అన్నారు. నేటికీ వేతనాలు పెంచలేదన్నారు.
20 సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తున్న ఆశలు..
జిల్లాలో ఆశ వర్కర్లు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారన్నారు.బడ్జెట్ సమావేశాల్లో నెలకు 18000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం కు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. లెప్రసీ సర్వే డబ్బులు, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలన్నారు.
గత హామీ మేరకు 50 లక్షల ఇన్సూరెన్స్, 50 వేల మట్టి ఖర్చులు ఇవ్వాలన్నారు. పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. టార్గెట్లను రద్దుచేసి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు చెల్లించాలన్నారు.
అర్హులైన వారిని ఏఎన్ఎంలుగా నియమించాలన్నారు. ప్రసూతి సెలవులు కల్పించి మహిళలకు అండగా నిలవాలన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను, పోరాటాలను ఆపలేరు అన్న విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. మార్చి 30న జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు నిర్వహించే రాస్తారోకో కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు.




