సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!
Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రైవేట్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!
Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తూ ముందున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాద వార్తపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రతపై ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.
మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
గాయపడిన వారి పరిస్థితిని బట్టి అవసరమైతే మెరుగైన చికిత్స కోసం సమీపంలోని కార్పొరేట్ లేదా పెద్ద ఆసుపత్రులకు తరలించాలని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సహాయక చర్యలను వేగవంతం చేస్తూ బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.




