Hyderabad: ఓయో రూమ్‌లో విషాదం.. పెళ్లి బట్టలు వేసుకుని యువకుడి ఆత్మహత్య!
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం చెందిన లోకేష్ అనే యువకుడు ఓయో రూమ్‌లో పెళ్లి బట్టలు ధరించి ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad: ఓయో రూమ్‌లో విషాదం.. పెళ్లి బట్టలు వేసుకుని యువకుడి ఆత్మహత్య!
Hyderabad: భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు, పెళ్లి బట్టలు ధరించి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
ప్రేమ పీటల వరకు వచ్చి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా చెర్లోపల్లికి చెందిన వనమాల లోకేష్ (29) చింతల్ గణేష్ నగర్‌లో నివసిస్తూ, గండిమైసమ్మలోని హెటిరో ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఒక యువతితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లోకేష్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ, యువతి తరపు వారు మాత్రం నిరాకరించారు.
పెళ్లి బట్టలు కొని..
పెద్దలను ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట, వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లోకేష్ కుటుంబ సభ్యులు పంపిన డబ్బుతో పెళ్లి బట్టలు, మంగళసూత్రం (పుస్తెలు) కూడా కొనుగోలు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 03, 2026) నాడు కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని 'ఫ్లాగ్ షిప్ సౌత్ పాయింట్ రెసిడెన్సీ' ఓయో రూమ్‌లో గది అద్దెకు తీసుకున్నారు.
విషాదాంతం:
మధ్యాహ్నం సమయంలో యువతిని భోజనం తీసుకురమ్మని బయటకు పంపిన లోకేష్, ఆ తర్వాత గదిలో పెళ్లి బట్టలు ధరించి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. యువతి తిరిగి వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది సాయంతో తలుపులు పగులగొట్టారు. లోకేష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా అనంత లోకాలకు వెళ్లడం ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.




