TGSRTC: ఇక పై అర్ధరాత్రి కూడా ఆర్టీసీ బస్సులు.. టైమింగ్స్, రూట్ల పూర్తి వివరాలు ఇవే
TGSRTC: హైదరాబాద్ నగరంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి.
TGSRTC
TGSRTC: భాగ్యనగర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెల్లవారుజాము వరకు నగరంలో నైట్ షిఫ్ట్ స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. అర్ధరాత్రి దాటాక డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల కార్మికులు రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి అర్ధరాత్రి వేళ నగరానికి చేరుకునే ప్రయాణికులు సొంత ఇళ్లకు వెళ్లడానికి ప్రైవేట్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి వేలకు వేలు తగలేయాల్సి వస్తోంది. ప్రయాణికుల ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం నిరంతర బస్సు సర్వీసులను అందుబాటులోకి తేనుంది.
కోఠి, సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు రూట్లలో సమయాలు
ప్రధాన రద్దీ ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆర్టీసీ ఈ నైట్ సర్వీసులను ప్రవేశపెడుతోంది. కోఠి నుంచి పటాన్చెరు (222A) రూట్లో మొత్తం నాలుగు బస్సులు తిరుగుతాయి. కోఠి నుంచి తొలి బస్సు రాత్రి 11.40 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు తెల్లవారుజామున 4.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు (219) మార్గంలో మొదటి సర్వీస్ రాత్రి 11.20 గంటలకు, చివరి సర్వీస్ తెల్లవారుజామున 3.00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
ముఖ్యమైన కనెక్టింగ్ మార్గాలు ఇవే
అఫ్జల్‌గంజ్ నుంచి పటాన్చెరు (218) మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు సేవలు అందిస్తాయి. తొలి బస్సు రాత్రి 11.25 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3.05 గంటలకు అఫ్జల్‌గంజ్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సులు సీబీఎస్, కోఠి, లక్డీకాపూల్, ఎస్.ఆర్. నగర్, వై-జంక్షన్, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా ప్రయాణిస్తాయి. హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ (290U) రూట్లో రాత్రి 11.20 గంటలకు మొదటి బస్సు, తెల్లవారుజామున 3.00 గంటలకు చివరి బస్సు నడుస్తుంది.
ఐటీ కారిడార్‌కూ ప్రత్యేక సర్వీసులు
ఐటీ ఉద్యోగుల కోసం బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ (195W) మార్గంలో రాత్రి 9.15 గంటల నుంచి తెల్లవారుజామున 3.10 గంటల వరకు బస్సులు తిరుగుతాయి. కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ (10H) రూట్లో తొలి బస్సు రాత్రి 10.55 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3.40 గంటలకు కొండాపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ సర్వీస్ సైబర్ టవర్స్, ఉషాకిరణ్, స్టేట్ హోమ్, ఆర్.జె. కాలేజ్, పోలీస్ లైన్స్, ప్లాజా మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సందేహాల నివారణకు ప్రయాణికులు 99592256160 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.




