TG SSC Results 2026 : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. మే వరకు ఆగక్కర్లేదు.. రేపే రిజల్ట్స్?
TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 29 లేదా 30న విడుదల కానున్నాయి. ఐదు లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది.
TG SSC Results 2026
TG SSC Results 2026 : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన ఐదు లక్షల మందికి పైగా విద్యార్థుల ఉత్కంఠకు తెరపడనుంది. మే మొదటి వారంలో వస్తాయనుకున్న ఫలితాలను, విద్యాశాఖ అంతకంటే ముందే అంటే ఏప్రిల్ నెలాఖరుకే విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. రేవంత్ రెడ్డి సర్కారు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో, అధికారులు ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారు చేశారు.
ముందుగానే టెన్త్ ఫలితాలు
తెలంగాణలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23వ తేదీకే జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) పూర్తి కావడంతో, ఫలితాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. తొలుత మే మొదటి వారంలో అనుకున్నప్పటికీ, ఏప్రిల్ 29 లేదా 30 తేదీల్లోనే ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.inలో ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సరిగ్గా లేని వారు సులభంగా వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్స్ పొందవచ్చు. ఇందుకోసం 80969 58096 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపి, మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే చాలు.. మీ మార్కులు వెనువెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీనివల్ల వెబ్సైట్ సర్వర్లు బిజీగా ఉన్నా ఇబ్బంది లేకుండా రిజల్ట్స్ చూసుకోవచ్చు.
ముందస్తు కసరత్తులు పూర్తి
ఫలితాల వెల్లడికి సంబంధించి విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన మరికొద్ది గంటల్లోనే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కుల ఎంట్రీ, ట్యాబులేషన్ ప్రక్రియ అంతా పూర్తయిందని సమాచారం. ఏప్రిల్ 29న కుదరని పక్షంలో, కచ్చితంగా ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు చేతికి అందుతాయి. 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటు మిగిలిన వారు తమ గ్రేడ్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.




