Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు.. అటు వానలు.. ఇటు ఎండలు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో వర్షాల హెచ్చరికలు, ఏపీలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Weather Update
Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. తాజా వాతావరణ పరిణామాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్స్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి సహా 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే గాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. నిన్న కురిసిన వడగండ్ల వానకు పలుచోట్ల పంటలు దెబ్బతినగా, సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో అత్యధికంగా 3.49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల సెగలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదని హెచ్చరించింది. అయితే, కోస్తా ఆంధ్రా, యానాంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణం ఎలా ఉందంటే?
భాగ్యనగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించనుంది.
తీర ప్రాంతాలకు హెచ్చరికలు
ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాబోయే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎండలు తీవ్రంగా ఉంటాయని, వడగాల్పుల పట్ల ప్రజలు ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.




