Telangana Heat Wave Alert: తెలంగాణలో భానుడి భగభగలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Telangana Heat Wave Alert: తెలంగాణలో ముదురుతున్న ఎండలు, వడగాడ్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Arun Chilukuri
Published on: 20 May 2026 5:40 PM IST
Telangana Heat Wave Alert
X

Telangana Heat Wave Alert: తెలంగాణలో భానుడి భగభగలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Telangana Heat Wave Alert: తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకూ ఎండల తీవ్రత, వడగాడ్పులు (Heat Waves) ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) సీఎం ఆదేశించారు.

తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) నుండి జిల్లా ఆసుపత్రుల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను, అవసరమైన అత్యవసర మందులను భారీగా అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. వడదెబ్బ బారిన పడిన బాధితులకు ఆసుపత్రుల్లో తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక వార్డులను, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు.

వేసవి కాలంలో ప్రజలకు అత్యంత అవసరమైన తాగునీరు, కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎండల దృష్ట్యా విద్యుత్ వినియోగం పెరిగినా లోడ్ షెడ్డింగ్ లేకుండా చూడాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి తక్షణమే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ముదురుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కూలీలు, నిరుపేదల విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story