Weather Update: తెలంగాణపై నిప్పుల వర్షం.. మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Weather Update: తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Arun Chilukuri
Published on: 9 April 2026 1:05 PM IST
Weather Update
X

Weather Update: తెలంగాణపై నిప్పుల వర్షం.. మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Weather Update: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఎండ తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు 'ఎల్లో హెచ్చరికలు' జారీ అయ్యాయి. అంటే ఇక్కడ కూడా ఎండల ప్రభావం అధికంగానే ఉండనుంది.

జాగ్రత్తలు తప్పనిసరి

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఓఆర్ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ మరియు కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం. భానుడి భగభగలు మరో రెండు మూడు రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, వృద్ధులు మరియు చిన్నపిల్లల విషయంలో అప్రమత్తత అవసరమని అధికారులు పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story