Singareni: సింగరేణి చరిత్రలో మైలురాయి.. తెలంగాణకు చేరిన ‘నైనీ’ తొలి బొగ్గు రైలు!

Singareni: ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలి బొగ్గు రైలు చేరుకుంది.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 2:24 PM IST
Singareni: సింగరేణి చరిత్రలో మైలురాయి.. తెలంగాణకు చేరిన ‘నైనీ’ తొలి బొగ్గు రైలు!
X

సింగరేణి చరిత్రలో మైలురాయి.. తెలంగాణకు చేరిన ‘నైనీ’ తొలి బొగ్గు రైలు!

Singareni: తెలంగాణ రాష్ట్ర ఇంధన భద్రతలో అత్యంత చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతమైంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు బ్లాక్, ప్రజా ప్రభుత్వ నిరంతర కృషి ఫలితంగా ఎట్టకేలకు ఆచరణలోకి వచ్చింది. నైనీ గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPP) 4,000 టన్నుల నాణ్యమైన బొగ్గుతో కూడిన తొలి రైలు విజయవంతంగా చేరుకుంది.

ఒడిశాలోని నైనీ నుంచి బయలుదేరిన ఈ రైలు దాదాపు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టింది. మొత్తం 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా అత్యుత్తమ జీ-10 (G-10) గ్రేడ్ నాణ్యమైన బొగ్గును విద్యుత్ కేంద్రానికి తరలించారు. 2015 ఆగస్టు 13న కేంద్ర బొగ్గు శాఖ సింగరేణికి కేటాయించిన ఈ గనిలో సుమారు 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి కోటి టన్నుల (10 మిలియన్ టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో 36 ఏళ్ల పాటు ఈ గని సేవలు అందించనుంది.

ఈ ప్రాజెక్ట్ సాకారమవ్వడం వెనుక ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యవేక్షణ, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అలుపెరగని కృషి ఉన్నాయి. కేంద్రం, ఒడిశా ప్రభుత్వాల నుంచి అనుమతుల సాధన కోసం భట్టి విక్రమార్క స్వయంగా రెండుసార్లు ఒడిశాలో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆటంకాలన్నీ తొలగిపోవడంతో 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో వర్చువల్ విధానంలో ఉత్పత్తిని ప్రారంభించగా, తాజాగా తొలి రేక్ తెలంగాణకు చేరుకుంది.

నైనీ గని నుంచి నాణ్యమైన బొగ్గు సరఫరా మొదలవ్వడంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి కొరత ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తో పాటు, గృహ, పారిశ్రామిక అవసరాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ విజయం ఎంతో ఊతమిస్తుందని భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story