Government Teachers: డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్లే..గవర్నమెంట్ టీచర్లకు సర్కార్ హెచ్చరిక
Government Teachers: పాఠశాలలకు సరిగ్గా రాకుండా, విధులకు ఎగనామం పెడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Government Teachers
Government Teachers: ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందిపై విద్యాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా ఆబ్సెంట్ అయ్యే వారిపై ఇకపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదని నిర్ణయించింది. విధులకు ఎగనామం పెట్టే వారిపై వెంటనే సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు ప్రారంభించాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది.
ఏడాది దాటితే డిస్మిస్
కొత్త మార్గదర్శకాల ప్రకారం కంటిన్యూగా ఏడాదికి మించి విధులకు హాజరుకాకపోతే సదరు టీచరు లేదా ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగిస్తారు. నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగికీ వరుసగా ఐదేళ్లకు మించి ఎలాంటి సెలవులను మంజూరు చేసేందుకు వీల్లేదు. విదేశీ సర్వీసుల్లో ఉంటూ గడువు ముగిసినా తిరిగి రాని వారికి, ఏడాదికి పైగా అనుమతి లేకుండా విధులకు దూరంగా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. వీరు తమ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగానే భావించి విచారణ పూర్తి చేస్తారు. ఆబ్సెంట్ అయినట్లు గుర్తించిన వెంటనే కాలయాపన చేయకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యం వహిస్తే అధికారులపైనా వేటు
ఉపాధ్యాయులు బడికి రాకపోయినా చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్న ఉన్నతాధికారులపై కూడా విద్యాశాఖ సీరియస్ అయింది. గైర్హాజరైన వారి వివరాలను దాచిపెట్టినా, చర్యల్లో జాప్యం చేసినా హెడ్‌మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలను బాధ్యులను చేస్తూ వారిపై కూడా వేటు వేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. ప్రతి డీఈఓ ఆఫీసులో ఆబ్సెంట్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించి, వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
ఆర్థిక ప్రయోజనాల్లో కోత
అనుమతి లేని గైర్హాజరు కాలాన్ని డైస్ నన్ (పనిచేయని కాలం)గా పరిగణిస్తారు. ఈ కాలానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించకపోవడమే కాకుండా, రాబోయే ఇంక్రిమెంట్లు, పింఛను వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా కోత విధిస్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది.




