Rythu Bharosa: అన్నదాతల ఖాతాల్లోకి నగదు.. రెండో విడత డేట్ ఫిక్స్..!

Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.

Arun Chilukuri
Published on: 8 April 2026 10:56 AM IST
Rythu Bharosa
X

Rythu Bharosa: అన్నదాతల ఖాతాల్లోకి నగదు.. రెండో విడత డేట్ ఫిక్స్..!

Rythu Bharosa 2nd Installment: వేయి కండ్లతో ఎదురు చూస్తున్న తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రెండో విడత తేదీలను ఫిక్స్ చేసింది. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించి తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 15న రెండో విడతను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో ఏప్రిల్ నెలాఖరుతో రైతు భరోసా నిధుల జమ పూర్తిచేయనుంది తెలంగాణ సర్కార్.

తెలంగాణ అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రెండో విడత డేట్‌ ఫిక్స్ అయింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సాయాన్ని అందించేందుకు రెడీ అయింది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఇది వర్తిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మార్చి 22న సిద్దిపేట జిల్లాలో రైతు భరోసా మొదటి విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో మొత్తం 70 లక్షల మంది భూయజమానుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 3,590 కోట్లు జమ చేశారు. ఈ విడతలో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా, ఒక ఎకరం కంటే తక్కువ ఉన్న వారు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఎకరాకు 6,000 వరకు సాయం అందింది. రెండో విడతలో ప్రభుత్వం ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి, ఐదు ఎకరాల వరకు ఉన్న మిగిలిన విస్తీర్ణానికి సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు, రెండవ విడత పంపిణీ కోసం దాదాపు 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని దశలవారీగా పంపిణీ చేసే వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా రెండవ విడతను ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మూడవ, చివరి విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేసే అవకాశం ఉంది. దీనితో యాసంగి సీజన్ కోసం కేటాయించిన మొత్తం 9,000 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story