Ration Card: రేషన్ కార్డ్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. కేవైసీ గడువు పొడగింపు

Ration Card: హైదరాబాద్‌లో రేషన్ ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. అలాగే ఆగస్టులో 3 నెలల ఉచిత బియ్యాన్ని ఒకేసారి అందించనున్నారు.

CR Reddy
Published on: 31 July 2026 7:11 AM IST
Ration Card
X

Ration Card

Ration Card: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాజధానిలో కురిసిన భారీ వర్షాలు, ప్రత్యేక సవరణ ప్రక్రియలను దృష్టిలో ఉంచుకుని రేషన్ ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో జులై 31తో ముగియనున్న గడువుపై ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగిస్తూ, అందరూ వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఒకేసారి 3 నెలల ఉచిత బియ్యం పంపిణీ

రేషన్ కార్డుదారులకు మరొక బంపర్ ఆఫర్‌ను పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు జరిగే రేషన్ పంపిణీలో భాగంగా.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఏకంగా 3 నెలల ఉచిత రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందిచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీనివలన ప్రజలు ప్రతి నెలా రేషన్ షాపుల ముందు క్యూ నిలబడాల్సిన అవసరం లేకుండా ఒక్కసారే మూడు నెలల కోటాను తీసుకునే వెసులుబాటు లభించింది.

సొంత ఊరికి వెళ్లక్కర్లేదు.. ఉచితంగానే ఈ-కేవైసీ

రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. దీనికోసం సొంత ఊర్లకు పరుగెత్తాల్సిన పనిలేదు. మీరు ఎక్కడున్నా, సమీపంలోని ఏదైనా రేషన్ షాపునకు లేదా మీసేవా కేంద్రానికి మీ ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకువెళ్లి బయోమెట్రిక్ వేలిముద్ర లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ సేవలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే అధికారులు చేస్తారని స్పష్టం చేశారు. కేవైసీ పూర్తి చేయకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోయి రేషన్ సరుకులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఆగస్టు నుంచే క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు

తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ స్మార్ట్ కార్డులలో ఆధునిక క్యూఆర్ కోడ్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలు ఉంటాయి. ఇప్పటికే కార్ల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయి అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. ఆగస్టు 1 లేదా 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఈ పంపిణీని ప్రారంభించనుండగా, జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు వీటిని అందజేస్తారు. అయితే జులై 31 లేదా పొడిగించిన గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని దాదాపు 5 లక్షల మందికి ఈ కొత్త కార్డులు అందవని ప్రభుత్వం తెగేసి చెప్పింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story