Uttam Kumar Reddy: అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే వార్తలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

Arun Chilukuri
Published on: 25 March 2026 5:05 PM IST
Uttam Kumar Reddy
X

Uttam Kumar Reddy: అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే వార్తలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన, ప్రజలు ఎటువంటి అపోహలను నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థ సాఫీగా సాగుతోందని భరోసా ఇచ్చారు.

బంకుల్లో రద్దీ పెరగడానికి ప్రధాన కారణం వదంతులేనని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాబోయే రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్లే కొన్ని చోట్ల 'నో స్టాక్' బోర్డులు వెలిశాయని, అంతేకానీ కొరత వల్ల కాదని వివరించారు.

హైదరాబాద్‌ నగరంలోని 596 పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ఏ ఒక్క బంకును కూడా మూసివేసేందుకు అనుమతించలేదని స్పష్టం చేశారు.

క్యాన్లలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు!

పెట్రోల్ బంకుల వద్ద క్యాన్లు, కంటైనర్లలో ఇంధనాన్ని నింపుకుని తీసుకువెళ్లడం చట్టవిరుద్ధమని మంత్రి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే బంకు యజమానులపై, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్యాస్ సరఫరాపై క్లారిటీ

గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి తెలిపారు. ముఖ్యంగా హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

కమర్షియల్ సిలిండర్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టామని, ఇప్పటికే 2,952 అక్రమ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. కమర్షియల్ గ్యాస్ ధరలు, సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి, చమురు కంపెనీలు కూడా సరిపడా నిల్వలు ఉన్నట్లు ధృవీకరించాయని, ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి బంకుల వద్దకు రావొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story