Adluri Laxman: రూపాయి అవినీతి నిరూపించినా రాజీనామా.. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి అడ్లూరు సవాల్!

Adluri Laxman: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 2:31 PM IST
Adluri Laxman
X

Adluri Laxman: రూపాయి అవినీతి నిరూపించినా రాజీనామా.. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి అడ్లూరు సవాల్!

Adluri Laxman: క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇసుక రవాణాలో తాము ఒక్క రూపాయి అయినా లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే.. క్షణాల్లో తమ మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సంచలన సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఉనికి కోసమే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లో మార్పు రాలేదని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. నియోజకవర్గంలో తాము పారదర్శకంగా పాలన అందిస్తుంటే ఓర్వలేకనే లేనిపోని అక్రమాలను అంటగడుతున్నారని ధ్వజమెత్తారు.

"ఇసుక దందాల్లో నాకు భాగస్వామ్యం ఉందని కొప్పుల ఈశ్వర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి. అలా నిరూపిస్తే నా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా తక్షణమే రాజీనామా చేసి, రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా" అని మంత్రి స్పష్టం చేశారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా.. ముఖ్యంగా ధర్మారం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగిందని మంత్రి అడ్లూరు ఆరోపించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఇసుక మాఫియా చెలరేగిపోయిందని, ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు గండి కొట్టారని విమర్శించారు. నాటి అక్రమ ఇసుక రవాణాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులైన ఎంతటి వారినైనా సరే చట్టం ముందు నిలబెట్టి తీరుతామని మంత్రి హెచ్చరించారు.

ఇప్పటికైనా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేస్తున్న తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. కేవలం పేపర్లలో, టీవీ వార్తల్లో నిలవడానికి మాత్రమే ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే ముందు వెనకా ముందు ఆలోచించి.. కొంతైనా నిజం అనిపిస్తేనే మాట్లాడాలన్నారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story