Liquor Price : మందుబాబులకు మత్తు దిగే షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

Liquor Price : తెలంగాణలో మే నెల నుంచి మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా గాజు సీసాల కొరత, పెరిగిన ఉత్పత్తి వ్యయం కారణంగా 12-15 శాతం ధరలు పెంచాలని తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

CR Reddy
Published on: 6 April 2026 9:46 AM IST
Liquor Price
X

Liquor Price 

Liquor Price : తెలంగాణలో భానుడు భగభగ మండుతుంటే, మరోవైపు మద్యం ప్రియులకు ధరల సెగ తగిలేలా ఉంది. వేసవి కాలంలో చల్లని బీరుతో ఉపశమనం పొందుదామనుకునే మందుబాబుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాల నుంచి స్థానిక ఉత్పత్తి సమస్యల వరకు అన్నీ కలిసి మే నెలలో మద్యం ధరల పెంపునకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఊహించని విధంగా తెలంగాణలోని మద్యం పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల నేచురల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాజు సీసాల తయారీలో సహజ వాయువు కీలక పాత్ర పోషిస్తుంది. సరఫరా తగ్గడంతో దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి పడిపోయింది. అనేక తయారీ యూనిట్లు మూతపడటంతో ఖాళీ సీసాల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో మద్యం బాటిలింగ్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని కంపెనీలు వాపోతున్నాయి.

రాష్ట్రంలో చివరిసారిగా 2023 మే నెలలో మద్యం ధరలను సవరించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ధరల సమీక్ష గడువు ముగిసింది. ఇదే అదునుగా భావిస్తున్న తయారీ సంస్థలు.. పెరిగిన ముడిసరుకు ఖర్చులు, రవాణా ఛార్జీల దృష్ట్యా ధరలను 12 నుంచి 15 శాతం వరకు పెంచాలని రేవంత్ సర్కార్‌ను కోరుతున్నాయి. ప్రస్తుతమున్న ధరలతో తాము నష్టాలను భరించలేమని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ఒక జ్యుడీషియల్ కమిటీని నియమించింది.

వేసవిలో బీర్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే, ప్రస్తుతం సీసాల కొరత వల్ల కంపెనీలు ఎక్కువగా క్యాన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ, అల్యూమినియం క్యాన్ల తయారీ ఖర్చు కూడా పెరగడంతో బీర్ల ధరలపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు ధరలు పెంచినప్పటికీ, మే నెలలో మరో రౌండ్ పెంపు ఉండే అవకాశం ఉంది. సరిపడా సరఫరా లేకపోతే మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడి, బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ధరల పెంపును శాస్త్రీయంగా అమలు చేయాలని యోచిస్తోంది. బాటిల్ పరిమాణం (Quarters, Halfs, Fulls), బ్రాండ్ విలువ, ధర శ్రేణిని బట్టి వేర్వేరు స్లాబ్‌లలో ధరలు పెంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జ్యుడీషియల్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ బ్రాండ్‌పై ఎంత పెంచాలనేది మే మొదటి వారంలో తేలిపోనుంది. రాష్ట్ర ఖజానాకు మద్యం ప్రధాన ఆదాయ వనరు కాబట్టి, సామాన్యులపై మరీ ఎక్కువ భారం పడకుండా, అటు కంపెనీలకు నష్టం రాకుండా మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

Next Story