Privacy Order: ఆ 200 పోస్టులు తొలగించాలి లేదంటే తాట తీస్తాం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

లైంగిక దాడి బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే 200 కంటే ఎక్కువ పోస్టులను తక్షణమే తొలగించాలని గూగుల్, మెటా, యూట్యూబ్, ఎక్స్ సంస్థలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Naresh.k
Published on: 25 July 2026 6:00 PM IST
Privacy Order
X

Privacy Order: ఆ 200 పోస్టులు తొలగించాలి లేదంటే తాట తీస్తాం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

High Court: ఒక లైంగిక దాడి ఎంతటి నరకాన్ని చూపుతుందో, ఆ తర్వాత డిజిటల్ మాధ్యమాల్లో బాధితురాలి ఫొటోలు, వీడియోలు నిరంతరం వైరల్ కావడం అంతకంటే ఘోరమైన మానసిక నరకాన్ని మిగులుస్తుంది. సమాజంలో మళ్లీ తలఎత్తుకుని బతకాలని ఆశపడే ఆ అభాగ్యురాలి ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియాలోని కొన్ని వ్యూస్, లైక్స్ దారుణంగా చిదిమేస్తుంటాయి. ఇలాంటి అత్యంత సున్నితమైన, దారుణమైన పరిస్థితుల్లో డిజిటల్ ప్రపంచపు దిగ్గజాలకు తెలంగాణ హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది.

బాధితురాలి వ్యక్తిగత ప్రైవసీని, రాజ్యాంగం కల్పించిన ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాపాడుతూ జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. లైంగిక నేరానికి గురైన ఒక బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేస్తూ, ఆమె డిజిటల్ ప్రైవసీకి భంగం కలిగిస్తున్న 200 కంటే ఎక్కువ వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ,నిరంతరం వైరల్ అవుతూ వ్యాప్తి చెందడంతో బాధితురాలు కోలుకోలేని మానసిక వేదనను అనుభవిస్తోంది.

ఈ కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గ్రీవెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. డిజిటల్ దిగ్గజాల బాధ్యతారాహిత్యంపై విసిగిపోయిన బాధితురాలు, హైకోర్టు అడ్వకేట్ నాగుర్‌బాబు ఎన్ ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది నాగుర్‌బాబు ఎన్ ధర్మాసనం ముందు రాజ్యాంగ నిబంధనలను, అత్యున్నత న్యాయస్థానం తీర్పులను బలంగా ఉంచారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 21 (ప్రైవసీ హక్కు) కింద పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు ఇది తీవ్ర విఘాతం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000, ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్-2021 లతో పాటు లైంగిక దాడి బాధితుల గుర్తింపును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు విస్మరించాయి.

నిరంతరం ప్రచారమవుతున్న ఈ వీడియోల వల్ల బాధితురాలు సమాజంలో సాధారణ జీవితం గడపలేకపోతోందని, ఆమె పునరావాసానికి తీవ్ర భంగం వాటిల్లుతోందని వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు, సోషల్ మీడియా సంస్థల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యవసర మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పిటిషన్ అనుబంధం-Aలో పేర్కొన్న 200కి పైగా వివాదాస్పద యూట్యూబ్ , గూగుల్ , మెటా , ఎక్స్ పోస్టులు, వీడియోలను ప్రాంతీయ లేదా గ్లోబల్ స్థాయిలో తక్షణమే తొలగించాలి లేదా బ్లాక్ చేయాలి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లకు కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసు సమగ్ర విచారణను ఆగస్టు 20, 2026కు వాయిదా వేసింది.

డిజిటల్ విప్లవం వేగవంతమైన ఈ కాలంలో, ఇంటర్మీడియరీ హోదా వెనుక దాక్కుంటూ చట్టపరమైన బాధ్యతలను విస్మరిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. లైక్స్, వ్యూస్ కంటే బాధితురాలి ప్రైవసీ, ఆత్మగౌరవమే అత్యున్నతమైనవి. సోషల్ మీడియా సైట్లు వ్యాపార వేదికలు మాత్రమే కావు, అవి దేశ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే.లైంగిక నేరాల బాధితుల హక్కులకు రక్షణగా నిలిచే ఈ ఉత్తర్వు, భావి తరాలకు మరియు డిజిటల్ వేదికలకు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story