Heavy Rain: మధ్యాహ్నం 3:30 నుంచే దశలవారీగా లాగౌట్: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు పోలీసుల ప్లాన్!

Heavy Rain: తెలంగాణలో ఈ రోజు, రేపు అతి భారీ వర్ష సూచన. ఉత్తర తెలంగాణకు ఆరంజ్ అలెర్ట్, హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు.

Arun Chilukuri
Published on: 29 July 2026 4:08 PM IST
Heavy Rain
X

Heavy Rain: మధ్యాహ్నం 3:30 నుంచే దశలవారీగా లాగౌట్: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు పోలీసుల ప్లాన్!

Heavy Rain: తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ 'ఆరంజ్ అలెర్ట్' జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు వర్షాభావ లోటు నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మైనస్ 19 శాతం (-19%) వర్షపాత లోటు నమోదైంది. అయితే ఈ రోజు, రేపు కురవనున్న అతి భారీ వర్షాలతో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

రాజధాని హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి, మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలతో పాటు హైడ్రా (HYDRAA) యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తమైంది. నీరు నిలిచే ప్రాంతాలు, నాలాలు మరియు చెరువుల వద్ద ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

వర్షాల సమయంలో ఐటీ కారిడార్ (గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ) పరిధిలో విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా నివారించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను సాయంత్రం ఒకేసారి కాకుండా మధ్యాహ్నం 3:30 గంటల నుంచే దశలవారీగా లాగౌట్ చేసి ఇళ్లకు పంపించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

ట్రాఫిక్ నరకం నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు ఐటీ యాజమాన్యాలు సహకరించాలని కోరారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story