Uttam Kumar Reddy: తెలంగాణలో ఇంధన కొరతకు ఆ ప్రచారమే కారణం.. వాస్తవాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత తీరిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇంధన ధరలు పెరుగుతాయనే వదంతుల వల్ల కృత్రిమ కొరత ఏర్పడిందని, ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి చేరిందని తెలిపారు.

Arun Chilukuri
Published on: 29 April 2026 12:55 PM IST
Uttam Kumar Reddy
X

Uttam Kumar Reddy: తెలంగాణలో ఇంధన కొరతకు ఆ ప్రచారమే కారణం.. వాస్తవాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: గత మూడు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. ఇంధన ధరలు భారీగా పెరగబోతున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత లీటరుకు రూ. 10 నుంచి 20 వరకు పెరుగుతుందనే ప్రచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దీనివల్ల అవసరానికి మించి ఇంధనం నింపుకోవడంతో బంకుల వద్ద రద్దీ పెరిగింది. పరిశ్రమలకు వాడే డీజిల్ ధర రూ. 150కి చేరడంతో, ఆ వినియోగదారులు కూడా సాధారణ బంకులపైనే ఆధారపడుతున్నారు. ఏపీ, మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలు తెలంగాణలోనే ఇంధనం నింపుతుండటంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.

ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర చమురు కంపెనీలతో సమీక్ష నిర్వహించి సరఫరాను వేగవంతం చేశారు. సాధారణం కంటే 126 శాతం అదనంగా ఇంధన సరఫరాను పెంచినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను నిరంతర సరఫరా కోసం కేటాయించారు. ఏప్రిల్ 27 నాటికి డీజిల్ పంపిణీ 151 శాతం, పెట్రోల్ 95 శాతానికి చేరింది.

ప్రస్తుత పంట కోతల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు, రవాణా రంగ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి మూడు గంటలకోసారి నిల్వలను సమీక్షిస్తున్నారు."రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. వచ్చిన సరుకును వచ్చినట్లుగా డిపోల నుంచి బంకులకు తరలిస్తున్నాం." అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story