Telangana: శాసనమండలిలో తీవ్ర గందరగోళం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్

Telangana: తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన. మంత్రి పొంగులేటి రాజీనామాకు డిమాండ్. చైర్మన్ పై కాగితాలు విసిరిన సభ్యుల సస్పెన్షన్.

KVD Varma
Published on: 30 March 2026 11:29 AM IST
Telangana: తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.
X

Telangana

Telangana Legislative Council: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలిలో గందరగోళం సృష్టించారు. తెలంగాణ శాసనమండలి సోమవారం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సభా మర్యాదలకు విఘాతం కలిగించారంటూ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ శాసనమండలి గేటు వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. శాసనమండలి ముందు నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ కు తరలించారు.

సభ ప్రారంభం నుంచీ..

సభ ప్రారంభం అయిన దగ్గర నుంచీ బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసనను వ్యక్తపరుస్తూ వచ్చాడు. మంత్రి పొంగులేటిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు పట్టుబట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులను మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, సభ్యులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు.

మరోవైపు, నిరసనల మధ్యే మంత్రి లక్ష్మణ్ కుమార్ బిల్లులపై చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారు. సభలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది పెద్దల సభ అని, ఇక్కడ సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఆయన పదే పదే సభ్యులకు సూచించారు. సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన చెబుతూ వచ్చారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

దొంగే దొంగ అన్నట్టుగా . .

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మండిపడ్డారు. పెద్దల సభలో సభ్యులు ఇంతలా దిగజారి వ్యవహరించడం శోచనీయమని, దొంగే దొంగ అన్నట్లుగా వారి తీరు ఉందని విమర్సించారు. సభను ఆదుకోవడమే లక్ష్యంగా వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చైర్మన్ ను దయాకర్ కోరారు.

ఈ గందరగోళంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. విపక్షాలు హౌజ్ కమిటీ వేయాలనడం సరికాదన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన మూడు హౌజ్ కమిటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వారికి సీబీ-సీఐడీ విచారణపై నమ్మకం లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆందోళనలు చేస్తున్నారంటూ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీల సస్పెన్షన్..

ఆ తరువాత సభలో గందరగోళం సృష్టించినందుకు గాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సభ నుంచి బయటకు వచ్చిన సభ్యులు గన్ పార్క్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు,మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. శాసనమండలి ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీలు అక్కడే బైఠాయించి "ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం" అంటూ నినాదాలు చేశారు.

నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వాహనాల్లో తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ ఘటనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరీలోనే సభలో బిల్లులపై చర్చ కొనసాగుతోంది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story