Bharat Future City: భారత్ ఫ్యూచర్ సిటీకి సింగపూర్ హంగులు.. డీపీ ఆర్కిటెక్ట్స్‌కు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు!
Bharat Future City: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్‌గా సింగపూర్‌కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్ ఎంపికైంది.
Bharat Future City: భారత్ ఫ్యూచర్ సిటీకి సింగపూర్ హంగులు.. డీపీ ఆర్కిటెక్ట్స్‌కు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు!
Bharat Future City: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు రూపకల్పనలో ఒక కీలక అడుగు పడింది. ఈ మెగా సిటీ మాస్టర్ ప్లాన్ తయారీ కన్సల్టెంట్‌గా సింగపూర్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ డిజైన్ సంస్థ ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ (DP Architects) ఖరారైంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) పరిధిలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు గ్లోబల్ టెండర్లలో మొత్తం ఆరు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడగా.. అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన డిజైన్లను కోట్ చేసిన సింగపూర్ సంస్థనే ప్రభుత్వం ఎంపిక చేసింది.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో నూతనంగా నిర్మించిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అధికారిక కార్యాలయం జూన్ 10న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ వేదికపైనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా సదరు సింగపూర్ సంస్థకు అధికారిక ఉత్తర్వులను (Work Orders) అందజేయనున్నారు. ఈ మెగా మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయడానికి కన్సల్టెంట్‌కు ప్రభుత్వం తొమ్మిది నెలల గడువు విధించింది.
ఏ రంగానికి ఎంతెంత భూమి?:
మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఎఫ్‌సీడీఏ (FCDA) పరిధిలో, మొదటి విడతగా 30 వేల ఎకరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి కోసం 13 వేల ఎకరాలను ప్రత్యేకంగా వర్గీకరించి ల్యాండ్ పూలింగ్ కింద వివిధ రంగాలకు భారీగా కేటాయించారు.
లైఫ్ సైన్సెస్ హబ్ (ఫార్మా): 4,000 ఎకరాలు
రెసిడెన్షియల్ జోన్ (నివాస ప్రాంతాలు): 2,477 ఎకరాలు
ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్: 2,177 ఎకరాలు
ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఎనర్జీ పార్క్: 1,976 ఎకరాలు
హెల్త్ సిటీ (వైద్య సేవలు): 594 ఎకరాలు
ఏఐ సిటీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్): 403 ఎకరాలు
డేటా సెంటర్ హబ్: 313 ఎకరాలు
ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్: 255 ఎకరాలు
వీటితో పాటు ఒక భారీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, ఫర్నిచర్ పార్క్ , అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా ల్యాండ్‌ను కేటాయించారు.
ఎఫ్‌సీడీఏ ప్రాంతం ప్రస్తుతం రెండు ప్రధాన జోన్ల మధ్య విస్తరించి ఉందని అధికారులు వివరించారు. ఉత్తర భాగం ఇప్పటికే హెచ్ఎండీఏ (HMDA) మాస్టర్ ప్లాన్ 2031 పరిధిలో విలీనమై, మెట్రోపాలిటన్ కారిడార్లతో అభివృద్ధి చెందుతోంది. మధ్య భాగంలో ఉన్న హైదరాబాద్ ఫార్మా సిటీ ల్యాండ్‌ను లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి ఫ్లాగ్‌షిప్ ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయితే దక్షిణ భాగం మాత్రం పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ఉండి ఎలాంటి చట్టబద్ధమైన భూవినియోగ ప్రణాళికలు లేకుండా ఉంది.
ఈ నేపథ్యంలో సరైన మాస్టర్ ప్లాన్ లేకపోతే అస్తవ్యస్తమైన వృద్ధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ ఫ్రేమ్‌వర్క్‌కు, ఈ ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లకు మధ్య సమన్వయం కుదురుస్తూ.. ఫ్యూచర్ సిటీని పర్యావరణహిత 'నెట్-జీరో' (Net-Zero) సూత్రాలతో ప్రపంచ స్థాయి ప్రమాణాల్లో నిర్మించేందుకే ఈ మాస్టర్ ప్లాన్ వ్యూహాన్ని రూపొందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.




