Nakrekal: నకిరేకల్‌లో శునకాల వీరంగం బాలుడికి తీవ్ర గాయాలు
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో వీధి కుక్కల స్వైరవిహారం. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు శరత్ చంద్రపై పిచ్చికుక్క దాడి చేసి ముఖాన్ని పీకివేసింది.
Nakrekal: నకిరేకల్‌లో శునకాల వీరంగం బాలుడికి తీవ్ర గాయాలు
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. అమాయక చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల పసివాడిపై ఓ పిచ్చికుక్క అమాంతం దాడి చేసి, ముఖాన్ని పీకివేయడంతో ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రక్తపు మడుగులో చిన్నారి..
పట్టణానికి చెందిన శరత్ చంద్ర (4) అనే బాలుడు తన ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ సంచరిస్తున్న ఓ పిచ్చికుక్క ఒక్కసారిగా బాలుడిపైకి లంఘించింది. చిన్నారి ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడి కేకలు విని తాత, నానమ్మలు పరుగున వచ్చి కుక్కను విదిలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తీవ్ర రక్తస్రావంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి మృత్యువుతో పోరాడుతున్నాడు.
అధికారుల నిర్లక్ష్యం.. జనం బెంబేలు
నకిరేకల్ పట్టణంలో గత కొంతకాలంగా పిచ్చికుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితుడి తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. వీధి కుక్కలు రోడ్లపై పడి పాదచారులను, వాహనదారులను వెంటాడుతున్నా మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




