Telangana Assembly: ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి.. అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన స్పీకర్ ప్రసాద్ కుమార్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల అంశంపై తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 8 Sept 2026 11:14 AM IST
Telangana Assembly
X

Telangana Assembly: ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి.. అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన స్పీకర్ ప్రసాద్ కుమార్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నిన్నటి ఘటనలపై రెండో రోజు కూడా సభలో తీవ్ర వాగ్యుద్ధం, గందరగోళం చెలరేగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ఎల్పీ నేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా సభ్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు పెట్టారని ఆవేశంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని యావత్‌ మహిళలపై జరిగిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నామని తెలిపారు. "కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరవ సభ కాస్తా కౌరవ సభగా మారింది. ఆనాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్‌ పార్టీకి పడుతుంది" అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులంటే సభతో పాటు తనకు కూడా ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. "మీరు చెబితే నేను వినట్లేదా.. ఎందుకంత ఆవేశం. ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి. నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు" అంటూ సభలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మి పట్ల తనకు కూడా అపారమైన గౌరవం ఉందని, తనకు ఉన్న ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లతో పాటు వారు కూడా తన సోదరీమణులేనని పేర్కొన్నారు. మహిళా సభ్యులపై దురుసు ప్రవర్తనకు సంబంధించిన పూర్తి నివేదిక రాగానే బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

ఈ పరిణామాలపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. స్పీకర్‌ను బెదిరించేలా బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరు ఉందని తప్పుపట్టారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ధోరణితో మాట్లాడటం మునుపెన్నడూ చూడలేదన్నారు. స్పీకర్‌ను బెదిరిస్తూ సభ నడిపించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. అలాగే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ సభ్యులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయకుండా దీనిపై రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story