Singireddy Niranjan Reddy: రేవంత్ రెడ్డి ఏపీకి నీళ్లు ఇస్తారనే ధీమాతోనే అక్కడ విత్తనాలు వేస్తున్నారు

Singireddy Niranjan Reddy: జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల చేయకుండా తెలంగాణ రైతులను గోస పెడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 29 July 2026 4:17 PM IST
Singireddy Niranjan Reddy
X

Singireddy Niranjan Reddy: రేవంత్ రెడ్డి ఏపీకి నీళ్లు ఇస్తారనే ధీమాతోనే అక్కడ విత్తనాలు వేస్తున్నారు

Singireddy Niranjan Reddy: ఎల్‌నినో ప్రతికూల పరిస్థితులు మరియు వర్షాభావ ప్రభావం ఉన్నప్పటికీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు నీళ్లు ఇస్తారనే ముందస్తు ధీమాతోనే ఆంధ్రప్రదేశ్ రైతులు పంటలు సాగు చేస్తున్నారని బిఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డిలతో కలిసి ఆయన బుధవారం జూరాల ప్రాజెక్టును స్వయంగా సందర్శించారు. అనంతరం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జూరాల ప్రాజెక్టు పరిధిలోని స్థానిక కాలువల నిర్వహణపై మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి స్థానికంగా ఉన్న కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయకుండా తెలంగాణ రైతులను ప్రస్తుత ప్రభుత్వం గోస పెడుతోందని మండిపడ్డారు. "రేవంత్ రెడ్డి ఎట్లయినా సరే ఆంధ్రకు నీళ్లు తరలిస్తారన్న ముందస్తు నమ్మకంతోనే అక్కడి రైతులు ధైర్యంగా విత్తనాలు వేసుకుంటున్నారు" అని నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత రాష్ట్ర రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై, అక్కడి ప్రాంతంపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతాంగంపై ముఖ్యమంత్రికి లేదనడానికి జూరాల కాలువలను నిర్లక్ష్యం చేయడమే ప్రత్యక్ష నిదర్శనమని దుయ్యబట్టారు. స్థానిక రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story