ప్రియుడితో ఏకాంతానికి అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకును నేలకేసి కొట్టి చంపిన తల్లి.. 20 రోజుల తర్వాత నాటకం బద్దలు!

Siddipet: సిద్దిపేట జిల్లాకు చెందిన జ్యోతి అనే మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని రెండేళ్ల కుమారుడిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 3:14 PM IST
ప్రియుడితో ఏకాంతానికి అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకును నేలకేసి కొట్టి చంపిన తల్లి.. 20 రోజుల తర్వాత నాటకం బద్దలు!
X

ప్రియుడితో ఏకాంతానికి అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకును నేలకేసి కొట్టి చంపిన తల్లి.. 20 రోజుల తర్వాత నాటకం బద్దలు!

Siddipet: కన్నప్రేమను మరిచి అక్రమ సంబంధం కోసం ఒక తల్లి చేసిన ఘాతుకం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కన్న కొడుకునే అత్యంత క్రూరంగా హతమార్చింది ఓ కన్నతల్లి. ఆ తర్వాత బాబుకు ఫిట్స్ వచ్చి చనిపోయాడంటూ అందరినీ నమ్మించి నాటకమాడింది. అయితే భర్తకు వచ్చిన అనుమానంతో 20 రోజుల తర్వాత ఈ పాశవిక హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జ్యోతి, రెండేళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు. ఈ కుటుంబం ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఈ క్రమంలో భార్య జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త స్వామి డ్యూటీకి వెళ్లిన సమయంలో జ్యోతి తన ప్రియుడైన నవీన్‌ను ఇంటికి పిలిపించుకునేది.

జ్యోతి, నవీన్ ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో చిన్నారి హరికృష్ణ తరచూ ఏడుస్తూ ఉండేవాడు. దీంతో తీవ్ర చిరాకు పడిన ప్రియుడు నవీన్.. "నీ కొడుకు నాకు నచ్చలేదు, వాడిని చంపేద్దాం" అని జ్యోతితో అన్నాడు. అక్రమ మోహంలో మునిగిపోయిన ఆ కన్నతల్లి కూడా అందుకు వెనుకాడకుండా సరేనంది. దీంతో ఇద్దరూ కలిసి ఏడుస్తున్న ఆ రెండేళ్ల పసికందును అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టి చంపేశారు.

బాబు చనిపోయిన తర్వాత జ్యోతి కొత్త నాటకానికి తెరలేపింది. భర్త స్వామి ఇంటికి రాగానే.. బాబుకు అకస్మాత్తుగా ఫిట్స్ (వూర్పులు) వచ్చాయని, ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడంటూ కన్నీరుమున్నీరైంది. భార్య మాటలను నిజమేనని నమ్మిన అమాయక భర్త.. అదే రోజు రాత్రి కుమారుడి మృతదేహాన్ని తమ స్వగ్రామమైన తీగుల్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి ఖననం చేశాడు.

కొడుకు చనిపోయిన కొద్దిరోజులకే జ్యోతి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. భార్య తీరుపై అనుమానం పెంచుకున్న స్వామికి, ఇంట్లో కొన్నిచోట్ల నిగూఢంగా ఉన్న రక్తపు మరకలు కనిపించడంతో ఆ అనుమానం కాస్త బలపడింది. తన కొడుకు మృతి వెనుక ఏదో రహస్యం ఉందంటూ స్వామి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రక్తపు మరకల ఆధారంగా పోలీసులు జ్యోతిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ప్రియుడు నవీన్‌తో కలిసే తన కొడుకును చంపేసినట్లు నిందితురాలు అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు కన్నతల్లి జ్యోతిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం పరారీలో ఉన్న కిరాతక ప్రియుడు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story