Shabad: ముగిసిన ఉన్మాది కథ.. పెంజర్లలో శవమై తేలిన నరహంతకుడు రాజ్‌కుమార్
Shabad: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Shabad: ముగిసిన ఉన్మాది కథ.. పెంజర్లలో శవమై తేలిన నరహంతకుడు రాజ్‌కుమార్
Shabad: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు, ఉన్మాది రాజ్‌కుమార్ (29) మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్‌లో అతడి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందింది ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌గా పోలీసులు నిర్ధరించారు. మృతదేహం పక్కనే విషపు సీసా (Poison Bottle) లభ్యం కావడంతో, అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఓ బాలికను వేధించిన వ్యవహారంలో తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్ గత శుక్రవారం అర్ధరాత్రి ఉన్మాదిగా మారి నరమేధం సృష్టించాడు. కేవలం అరగంట వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక, ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా మొత్తం ఆరుగురిని కిరాతకంగా అంతమొందించాడు.
తొలుత సదరు బాలిక నివాసానికి వెళ్లిన నిందితుడు.. బాలిక తల్లి, నానమ్మలను కత్తిపోట్లతో కడతేర్చాడు. ఆ తర్వాత బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా, తిరిగి తన ఇంటికి వెళ్లి భార్యతో పాటు నిద్రిస్తున్న కన్న బిడ్డల గొంతుకోసి కర్కశంగా హతమార్చాడు.
ఈ దారుణ నరమేధం అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. నిందితుడి కుటుంబసభ్యులు, సన్నిహితులను విచారించారు. ఈ క్రమంలోనే సోమవారం పెంజర్లలోని ఓ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమవడంతో ఈ సంచలన కేసులో ఉన్మాది కథ ముగిసింది.




