VC Sajjanar: డ్రైవింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ చూస్తున్నారా? క్లీన్ బౌల్డ్ అవుతారు జాగ్రత్త!
VC Sajjanar: ఐపీఎల్ సీజన్‌లో డ్రైవింగ్ చేస్తూ స్కోర్లు చూసే వారికి సజ్జనార్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. క్రికెట్‌లో డీఆర్ఎస్ ఉంటుంది కానీ, యముడి దగ్గర ఉండదంటూ చమత్కరిస్తూనే హెచ్చరించారు
VC Sajjanar: డ్రైవింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ చూస్తున్నారా? క్లీన్ బౌల్డ్ అవుతారు జాగ్రత్త!
VC Sajjanar: తనదైన శైలిలో సామాజిక అంశాలపై స్పందించే హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో వాహనదారులకు ఒక కీలక హెచ్చరిక చేశారు. క్రికెట్ పరిభాషను వాడుతూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
"మీరు చూసే ఐపీఎల్‌లో DRS (డెసిషన్ రివ్యూ సిస్టమ్) ఉంటుంది. కానీ యమధర్మరాజు వద్ద మాత్రం DRS (డెత్ రివ్యూ సిస్టమ్) ఉండదు" అంటూ ఆయన చమత్కరించారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే, క్రికెటర్ లాగా పెవిలియన్‌కు కాదు.. నేరుగా పైకి పోతారని హెచ్చరించారు.
డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌లో స్కోర్ బోర్డ్ చూడటం వల్ల మీ జీవితం 'జీరో'కే క్లీన్ బౌల్డ్ అయ్యే ప్రమాదం ఉంది. మీకు మ్యాచ్ ముఖ్యం కావొచ్చు, కానీ మీ కోసం ఇంట్లో ఎదురుచూసే మీ కుటుంబానికి మీరే ముఖ్యం. క్రికెట్ పట్ల అభిమానం ఉండటం మంచిదే కానీ, అది ప్రాణాలు తీసే 'వెర్రి పిచ్చి'గా మారకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
ట్వీట్‌తో పాటు ఒక అవగాహన వీడియోను కూడా షేర్ చేసిన సజ్జనార్, అంపైర్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం క్రికెట్‌లో ఉంటుందని, కానీ రోడ్డు ప్రమాదంలో ఆ అవకాశం ఉండదని గుర్తుచేశారు. ఈ వినూత్న ప్రచారంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




