Hyderabad: శబరి ఎక్స్‌ప్రెస్‌లో కలకలం.. భార్య ముందే రైలు బాత్‌రూమ్‌లో భర్త, ప్రియురాలి ఆత్మహత్యాయత్నం!
Hyderabad: శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి భార్య తన భర్తను, అతడి ప్రియురాలిని పట్టుకుని హైదరాబాద్ తీసుకువస్తుండగా..
Hyderabad: శబరి ఎక్స్‌ప్రెస్‌లో కలకలం.. భార్య ముందే రైలు బాత్‌రూమ్‌లో భర్త, ప్రియురాలి ఆత్మహత్యాయత్నం!
Hyderabad: రైలు ప్రయాణంలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. భార్య, బంధువులు తనను ఊరికి తీసుకెళ్తున్నారనే ఆందోళనతో.. భార్య కళ్లెదుటే భర్త, అతడి ప్రియురాలు రైలు బాత్‌రూమ్‌లో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శబరి ఎక్స్‌ప్రెస్ రైలు చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘోరం జరిగింది. సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ (RPF) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఛప్రా గ్రామానికి చెందిన శిరీశ్‌కుమార్ (34)కు సులోచనతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిరీశ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత (34)తో శిరీశ్‌కు పరిచయం ఏర్పడింది. సదరు వివాహిత భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె తన పిల్లలతో కలిసి హైదరాబాద్ మూసాపేటలోని తన సోదరి ఇంట్లో నివాసముంటోంది. తరచూ ఆమెను కలిసేందుకు శిరీశ్‌కుమార్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో నెల రోజుల కిందట వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు.
తన భర్త ప్రియురాలితో కలిసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న భార్య సులోచన.. వారి కోసం గాలించడం ప్రారంభించింది. వారు తమిళనాడులోని కోయంబత్తూరులో నివాసముంటున్నట్లు సమాచారం అందడంతో.. సులోచన తన బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం పంచాయితీ చేసి, వారిద్దరినీ తీసుకుని సోమవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో 'శబరి ఎక్స్‌ప్రెస్' రైలు ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో రైలు చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకుంది. కొద్దిసేపట్లో రైలు సికింద్రాబాద్ చేరుకుంటుందనగా.. శిరీశ్‌కుమార్, అతడి ప్రియురాలు ఇద్దరూ కలిసి ఒకేసారి బాత్‌రూమ్‌లోకి వెళ్లారు. తాము వెంట తెచ్చుకున్న గడ్డి మందు ద్రావణాన్ని (పురుగుల మందు) ఇద్దరూ తాగేశారు. వారు బాత్‌రూమ్ నుండి బయటకు వచ్చి అపస్మారక స్థితికి చేరుకోవడంతో భార్య సులోచన గమనించి గట్టిగా కేకలు వేసింది.
తోటి ప్రయాణికుల సహాయంతో వెంటనే సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. రైలు స్టేషన్‌కు రాగానే పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న శిరీష్, అతడి ప్రియురాలిని హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




