CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సవాల్.. కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు.!

CM Revanth Reddy: వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

G Krishna
Published on: 16 Aug 2026 7:54 PM IST
CM Revanth Reddy
X

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సవాల్.. కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు.!

CM Revanth Reddy: వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శల వర్షం కురిపించారు. రానున్న సెప్టెంబర్‌లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, తమ రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని పనులపై అసెంబ్లీ వేదికగానే ప్రత్యక్ష చర్చకు రావాలని సవాల్ విసిరారు. బావా-బావమరిదితో పాటు కేసీఆర్‌ను కూడా సభకు తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు.

అసెంబ్లీ వేదికగానే చర్చకు సవాల్.. నిరుద్యోగులకు కీలక సూచన

పదేళ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయలేని వారు, ఇప్పుడు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "అగ్గిపెట్టేరావు, అఘోరరావు" మాటలు విని మోసపోవద్దని నిరుద్యోగులకు హితవు పలికారు. ధర్నాలు, నిరసనల్లో పాల్గొని కేసులతో భవిష్యత్తును ఇబ్బందికరంగా మార్చుకోవద్దని, అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ విడతల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అనుభవం లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోందని స్పష్టం చేశారు.

రక్తదానం పేరుతో సొమ్ము చేసుకున్నారు: తీవ్ర ఆరోపణలు

రక్తదానం కార్యక్రమాల పేరుతో కేటీఆర్, హరీశ్‌రావు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పార్టీలో పదవులు అనుభవించిన కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు ఎందుకు రక్తదానం చేయలేదని నిలదీశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వచ్చేదేమీ లేదని, అసెంబ్లీ వేదికగానే ఏ విషయం అయినా తేల్చుకుందామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా తమను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.

వరంగల్ గడ్డకు రాజకీయ చైతన్యం.. రైతాంగానికి అండగా కాంగ్రెస్

ఎప్పటికీ అధికారంలోనే ఉంటామని విర్రవీగిన వారిని వరంగల్ జిల్లా ప్రజలు ఓడించి రాజకీయంగా బొందపెట్టారని సీఎం అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతను యశస్విని రెడ్డి భారీ మెజారిటీతో ఓడించి ప్రజా తీర్పును నిరూపించారని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ 'వరి వేస్తే ఉరే' అని రైతులను భయపెడితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వివరించారు. బీఆర్ఎస్ రెండుసార్లు రుణమాఫీ పేరిట మోసం చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. మొత్తంగా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.లక్షా 37 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

కేటీఆర్, కేసీఆర్‌లపై వ్యక్తిగత విమర్శలు

జైలు నుంచి వచ్చి కష్టాల్లో ఉన్న సొంత సోదరి కవితకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో కేటీఆర్ ఆమెను ఇంటి నుంచి బయటకు పంపేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొడుకు చేస్తున్న దాష్టీకాలను చూస్తూ కూడా కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మౌనంగా ఉండిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు అమాయకులైన కార్యకర్తల రక్తాన్ని సైతం అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story