T Fiber : ఇకపై ప్రైవేట్ ఇంటర్నెట్‌కు చెక్.. తెలంగాణలో ఇంటింటికీ టీ-ఫైబర్ ఇంటర్నెట్
T Fiber : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ఇంటర్నెట్ మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది.
T Fiber
T Fiber : రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటివరకు వినియోగిస్తున్న ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇకపై అన్ని ప్రభుత్వ విభాగాలు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక నెట్‌వర్క్ అయిన టీ-ఫైబర్ సేవలను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో టీ-ఫైబర్ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నిర్ణీత గడువులోగా టీ-ఫైబర్ కనెక్టివిటీ అందించే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి చెప్పారు.
ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులపై కఠిన ఆంక్షలు
ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు స్వంత నెట్‌వర్క్ వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPs) ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని మంత్రి ఖరాకండిగా ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్ పరిధిలోకి మార్చాలని నిర్ణయించారు. దీనివల్ల ఒకే ఒక బలమైన నెట్‌వర్క్ ద్వారా ప్రభుత్వ సమాచార మార్పిడి, ఆన్‌లైన్ సేవలు మరింత సురక్షితంగా, వేగవంతంగా జరుగుతాయని అధికారులు వివరించారు.
ఫ్యూచర్ సిటీ నుంచి పల్లెల వరకు డిజిటల్ విప్లవం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి ప్రారంభ దశ నుంచే పూర్తిస్థాయి టీ-ఫైబర్ హై-స్పీడ్ ఇంటర్నెట్ మౌలిక వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను, సాంకేతిక మార్పులను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమాన స్థాయిలో ఇంటర్నెట్ లభించేలా చూసి, పట్టణ-గ్రామీణ డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యం వేగవంతం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అతి తక్కువ ధరకు తలుపు తట్టించే “ఇంటింటికి ఇంటర్నెట్” పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఐటీ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొని ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు.




