Health ATMs : నిమిషాల్లోనే 132 రకాల టెస్టులు.. రిపోర్టులు కూడా వెనువెంటనే.. త్వరలో హెల్త్ ఏటీఎంలు
Health ATMs : తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం నిమిషాల్లోనే 132 రకాల వైద్య పరీక్షలు చేసి రిపోర్టులు ఇచ్చే ఈ అత్యాధునిక యంత్రాలతో సామాన్యులకు వేగవంతమైన వైద్యం అందనుంది.
Health ATMs
Health ATMs : తెలంగాణలో ప్రభుత్వ వైద్యం మరో మెట్టు ఎక్కబోతోంది. ఆస్పత్రులకు వెళ్తే గంటల తరబడి క్యూలో నిలబడి, రిపోర్టుల కోసం రోజుల తరబడి వేచి చూసే కష్టాలకు రేవంత్ సర్కార్ చెక్ పెట్టబోతోంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే వందకు పైగా ఆరోగ్య పరీక్షలు చేసే హెల్త్ ఏటీఎంలను (Health ATMs) రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఆరోగ్య శాఖ గత కొంతకాలంగా కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, మలక్ పేట్ ఏరియా ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ఏటీఎంలను నిర్వహించింది. ఈ పరీక్షల్లో హెల్త్ ఏటీఎంలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ మెషీన్లలో వచ్చిన రిపోర్టులను, టీ-డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులతో పోల్చి చూడగా.. ఫలితాలు 100 శాతం ఖచ్చితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేశారు.
ఒకే చోట 132 రకాల పరీక్షలు.. అదీ నిమిషాల్లోనే
సాధారణంగా ఒక రోగికి బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు చేయాలంటే వేర్వేరు గదులకు వెళ్లి గంటల కొద్దీ వేచి చూడాలి. కానీ ఈ హెల్త్ ఏటీఎం (ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్) దగ్గరకు వెళ్తే చాలు.. అన్నీ ఒకే చోట పూర్తవుతాయి. బరువు, ఎత్తు, బాడీ టెంపరేచర్, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి ప్రాథమిక పరీక్షలతో పాటు.. డెంగ్యూ, మలేరియా, కొలెస్ట్రాల్, హెచ్ఐవీ వంటి క్లిష్టమైన పరీక్షలు కూడా ఇక్కడ నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతాయి. మొత్తం 132 రకాల టెస్టులను ఆటోమేటిక్‌గా చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది.
డిజిటల్ హెల్త్ రికార్డ్.. నేరుగా డాక్టర్‌తో సంభాషణ
ఈ హెల్త్ ఏటీఎంల ప్రత్యేకత ఏంటంటే.. పరీక్షలు పూర్తయిన వెంటనే రోగికి సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డ్‌ను ఇది తయారు చేస్తుంది. భవిష్యత్తులో చికిత్స కోసం ఈ రికార్డులను ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంతేకాదు, పరీక్షల తర్వాత మెషీన్ ద్వారానే వీడియో కాల్ లేదా ఆడియో కాల్ లో డాక్టర్లతో మాట్లాడి సలహాలు పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో రూపొందించిన ఈ యంత్రాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్ రద్దీని గణనీయంగా తగ్గిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం
ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలను ఉచితంగా అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. డాక్టర్ల కోసం లేదా ల్యాబ్ టెక్నీషియన్ల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, తక్షణమే రోగ నిర్ధారణ జరిగితే ప్రాణాపాయం నుంచి రోగులను త్వరగా రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ హెల్త్ ఏటీఎంలు కొలువుదీరనున్నాయి.




