PM Modi : మోదీ హైదరాబాద్ పర్యటనలో కీలక మార్పు.. బేగంపేట టు హైటెక్ సిటీ.. పక్కాగా కొత్త రూట్ మ్యాప్

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సిన ప్రధాని, ఇప్పుడు రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారు.

CR Reddy
Published on: 9 May 2026 7:44 AM IST
PM Modi
X

PM Modi 

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రధాని ప్రయాణ మార్గంలో కీలక మార్పులు జరిగాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీ (HICC) వరకు ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్లాన్‌ను అధికారులు రద్దు చేశారు. ఇప్పుడు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెచ్‌ఐసీసీ, అక్కడి నుంచి సాయి సింధు ఆసుపత్రి, తిరిగి పరేడ్ గ్రౌండ్ వరకు ప్రధాని పర్యటన మొత్తం రోడ్డు మార్గంలోనే సాగనుంది.

నిమిషాల వారీగా కొత్త షెడ్యూల్ ఇదీ..

మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరనున్న ప్రధాని, మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30 గంటల నుంచి అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీకి వెళ్లి, సాయంత్రం 3.45 నుంచి 4.15 మధ్య సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 4.40 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకుంటారు.

పరేడ్ గ్రౌండ్స్ సభ, తిరుగు ప్రయాణం

కాసేపు విశ్రాంతి అనంతరం సాయంత్రం 5.30 గంటలకు మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ గంట పాటు (సాయంత్రం 6.30 వరకు) జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే 6.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరి వెళ్తారు. ప్రధాని పర్యటన మొత్తం రోడ్డు మార్గంలో జరగనుండటంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.

అధికారుల సమీక్ష.. ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని షెడ్యూల్‌లో మార్పుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు ఉండకూడదని, అవసరమైన రోడ్డు మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే బందోబస్తు మరియు ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని రోడ్డు మార్గంలో ప్రయాణించడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story