Telangana Degree Entrance Test: విద్యాశాఖ కొత్త రూల్స్ః ఇకపై డిగ్రీలో చేరాలంటే ఎంట్రన్స్‌ పాస్‌కావాల్సిందే

Telangana Degree Entrance Test: తెలంగాణలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ షాక్ ఇవ్వబోతోంది.

Balachander
Published on: 9 April 2026 12:36 PM IST
Telangana Degree Entrance Test
X

Telangana Degree Entrance Test

Telangana Degree Entrance Test: తెలంగాణలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు ఇంటర్ మార్కుల ఆధారంగా 'దోస్త్' అనే ప్రక్రియ ద్వారా సీట్లు పొందుతున్న విధానానికి స్వస్తి పలికి, భవిష్యత్తులో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న విధానానికి అడ్డుకట్ట వేస్తూ, అందరికీ ఒకే పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 826 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు ఈ దోస్త్‌ పరిధిలోకి వస్తాయి. అయితే, ఇవి కాకుండా మరో 70 ప్రైవేటు కళాశాలలు తాము దోస్త్‌ పరిధిలోకి రామని అంటూ సొంతంగా ఎంట్రన్స్‌ పరీక్షలు నిర్వహించుకొని విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ విధానాలు అమలౌతున్నప్పటికీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీనికి స్వస్తిపలికేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు కూడా డిగ్రీకి ఎంట్రన్స్ ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. అయితే విధివిధానాల ఖరారుకు సమయం పడుతుండటంతో, ఈ విద్యాసంవత్సరం అంటే 2026-27కి యథావిధిగా 'దోస్త్' ద్వారానే ప్రవేశాలు ఉంటాయని విద్యాశాఖ తెలియజేసింది. వచ్చే విద్యాసంవత్సరం అంట 2027-28 నాటికి అందరికీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయంటే...

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3.77 లక్షల సీట్లు ఉండగా ఇందులో 46 శాతం మాత్రమే భర్తి అవుతున్నాయి. అంటే సుమారు 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తి అవుతున్నాయి. కాగా, 60 శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. 70 కళాశాలల్లో ఒక్క విద్యార్థికూడా చేరడం లేదు. జీరో అడ్మీషన్లు నమోదవుతున్న కాలేజీల్లో కోర్సులు క్యాన్సిల్‌ చేయాలని ఆయా కాలేజీలు విద్యాశాఖను అభ్యర్థిస్తున్నా ప్రతిపాదనల వరకే పరిమితం అవుతున్నాయి.

సిలబస్‌ మార్పుసై సందిగ్దత

పూర్తిస్థాయిలో అడ్మీషన్లు జరగడం లేదని ఒవైపు మొత్తుకుంటున్న సమయంలో మరోవైపు సిలబస్‌ మార్పుపై విద్యామండలి, కళాశాల విద్యాశాఖ మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం చూసుకుంటే ఉన్నత విద్యామండలికే సిలబస్ మార్చే అధికారం ఉన్నప్పటికీ, కమిషన్ విద్యాశాఖ కూడా కొత్తగా కసరత్తు చేస్తుండటంతో యూనివర్సిటీ డీన్లు అయోమయంలో పడ్డారు. గత ఏడాది 95% సిలబస్ అమలైనా, ఉస్మానియా వంటి వర్సిటీల్లో భాషా సబ్జెక్టుల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అటువంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే... అడ్మీషన్ల ప్రక్రియను ప్రక్షాళన చేయడం వలన విద్యార్థులపై ఫీజుల భారం తగ్గడంతో పాటు, నాణ్యమైన విద్య అందుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఉన్న విధానాన్ని పక్కనపెట్టి విద్యార్థులు డిగ్రీలో చేరడం కోసం తప్పనిసరిగా పోటీ పరీక్షలు రాయాల్సిందే. దీనికి మానసికంగా సిద్దంగాక తప్పదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story