Mallu Ravi: జీవన్ రెడ్డి వెళ్లడానికి అసలు కారణం ఇదే.. మల్లు రవి సంచలన వ్యాఖ్యలు!
Mallu Ravi: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడటంపై ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ పదవి రాలేదన్న సాకుతో పార్టీని వీడటం సరికాదని, బీఆర్ఎస్ వలలో ఆయన చిక్కుకున్నారని విమర్శించారు.
Mallu Ravi: జీవన్ రెడ్డి వెళ్లడానికి అసలు కారణం ఇదే.. మల్లు రవి సంచలన వ్యాఖ్యలు!
Mallu Ravi: సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంపై ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఎంపీ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో వెలుగొందిన నేత, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వైపు వెళ్లడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
పదవి కోసమే పార్టీ వీడారా?
"రాజ్యసభ అవకాశం దొరకలేదనే కారణంతోనే జీవన్ రెడ్డి పార్టీని వీడారని భావిస్తున్నాను. 14 సార్లు కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన ఆయనను ఇలా చూడాల్సి రావడం బాధాకరంగా ఉంది" అని మల్లు రవి అన్నారు. జీవితాంతం దొరల గడీలకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ చెంతకు చేరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ చరిత్రను గుర్తు చేస్తూ..
బీఆర్ఎస్‌లో చేరిన నేతలకు భవిష్యత్తు ఉండదని మల్లు రవి హెచ్చరించారు.. "కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను."తెలంగాణ ఉద్యమం చేసిన ఈటల రాజేందర్, రాజయ్య వంటి వారినే బయటకు పంపిన చరిత్ర కేసీఆర్‌దని, జీవన్ రెడ్డిని మాత్రం ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు.
వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోవద్దు:
"బీఆర్ఎస్‌లో చేరిన రోజు మాత్రమే పండగలా ఉంటుంది, ఆ తర్వాత అంతా దండగే" అని మల్లు రవి ఎద్దేవా చేశారు. పదవులు, గుర్తింపు ఇస్తామని చెప్పే మాటలు నమ్మి ఇన్నాళ్లూ సంపాదించుకున్న వ్యక్తిత్వాన్ని, పరువును జీవన్ రెడ్డి దెబ్బతీసుకోవద్దని సూచించారు. కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఇప్పుడు జీవన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. కేసీఆర్ పాలన దేని కోసం మళ్ళీ రావాలో జీవన్ రెడ్డి స్పష్టం చేయాలని మల్లు రవి డిమాండ్ చేశారు.




