మొయినాబాద్ జంట హత్యల కేసులో ఘోరం: అప్పులు ఎగ్గొట్టేందుకు 8 మంది హత్యకు లేడీ విలన్ స్కెచ్..

Moinabad Twin Murder Case: మొయినాబాద్ జంట హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. అప్పులు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఎనిమిది మంది మహిళలను చంపేందుకు కరీమాబీ దంపతులు స్కెచ్ వేశారు.

Arun Chilukuri
Published on: 18 May 2026 4:19 PM IST
moinabad
X

మొయినాబాద్ జంట హత్యల కేసులో ఘోరం: అప్పులు ఎగ్గొట్టేందుకు 8 మంది హత్యకు లేడీ విలన్ స్కెచ్..

Moinabad Twin Murder Case: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లో జరిగిన జంట హత్యల కేసు దర్యాప్తులో నమ్మలేని, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పులు ఇచ్చి డబ్బులు తిరిగి అడుగుతున్నారనే కక్షతో.. ఏకంగా ఎనిమిది మంది మహిళలను వరుసగా మట్టుబెట్టేందుకు కరీమాబీ అనే మహిళ తన భర్తతో కలిసి ఘోరమైన ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా స్క్రీన్‌ప్లేను తలపించేలా సాగిన ఈ మరణ మృదంగంలో ఇప్పటికే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఆరుగురు మహిళలు తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. కరీమాబీ దంపతులు తాండూర్ పరిధిలోని పలువురు మహిళల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో, వారిని ఎలాగైనా వదిలించుకోవాలని ఈ దంపతులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమకు అప్పు ఇచ్చిన ఎనిమిది మంది మహిళల జాబితాను సిద్ధం చేసుకున్నారు. "మీ డబ్బులు ఇచ్చేస్తాం, మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు రండి" అని నమ్మబలికి పిలిపించారు. నమ్మి వచ్చిన తాండూర్ పరిధికి చెందిన ఇద్దరు మహిళలను అత్యంత క్రూరంగా హత్య చేసి ఫామ్‌హౌస్‌లోనే పూడ్చిపెట్టారు.

కరీమాబీ దంపతుల క్రూరత్వం ఇంతటితో ఆగలేదు. తమకు అప్పు ఇచ్చిన మిగిలిన ఆరుగురు మహిళలను కూడా అదే ఫామ్‌హౌస్‌కు పిలిచి, ఒకే తరహాలో అంతమొందించాలని ప్లాన్ చేశారు. అయితే, అప్పటికే ఇద్దరు మహిళలు అదృశ్యం కావడం, తమను కూడా కరీమాబీ దంపతులు అదే ఫామ్‌హౌస్‌కు రమ్మని పదే పదే ఒత్తిడి చేస్తుండటంతో సదరు ఆరుగురు మహిళలకు తీవ్ర అనుమానం వచ్చింది. కరీమాబీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆ ఆరుగురు మహిళలు తక్షణమే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేవలం అప్పులు తీసుకొని, ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే కరీమాబీ దంపతులు ఈ తరహా వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఆరుగురు మహిళలు సమయానికి అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక పెద్ద సీరియల్ కిలింగ్స్ ముఠా గుట్టు రట్టయినట్లయింది. ఈ దంపతుల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు ఫామ్‌హౌస్ పరిసరాల్లో తవ్వకాలు జరుపుతూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story