Hyderabad: ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో 2024 బ్యాచ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 10:55 AM IST
Hyderabad
X

Hyderabad: ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!

Hyderabad: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ ఆవరణలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జె.సాయి కుమార్ (2024 బ్యాచ్) ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ప్రస్తుతం ఈ-కాప్స్ (e-COPS) డ్యూటీ నిమిత్తం ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌ అయిన సాయికుమార్, కర్మన్‌ఘాట్‌లో తన స్నేహితులతో కలిసి ఒక గదిలో నివాసముంటున్నారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా, పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.

మరోవైపు సాయికుమార్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story