Konda Sushmita: 'రేవంత్ ఫ్యామిలీ అవినీతినే టార్గెట్ చేశా'.. కొండా సుస్మిత సంచలన కామెంట్స్!
Konda Sushmita: సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Konda Sushmita: 'రేవంత్ ఫ్యామిలీ అవినీతినే టార్గెట్ చేశా'.. కొండా సుస్మిత సంచలన కామెంట్స్!
Konda Sushmita: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీఎల్పీ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో, సుస్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకున్నారు.
ఒక జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన కొండా సుస్మిత, తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. "నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్ పట్ల ఎంతో గౌరవం ఉంది. నేను కేవలం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ అవినీతిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాను" అని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాశ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. అభ్యర్థులను నిర్ణయించడానికి సీడబ్ల్యూసీ (CWC) వంటి అధిష్టాన వ్యవస్థలు ఉన్నాయని గుర్తుచేశారు.
వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడిన సుస్మిత, రాబోయే ఎన్నికల్లో తాను పరకాల నుంచి పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం సోదరుడికి చెందిన ఒక కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇప్పించే ప్రయత్నం చేస్తే సీఎం కుటుంబం చేసిన మరిన్ని అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని హెచ్చరించారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ అంతర్గత విబేధాలు రచ్చకెక్కగా, అధిష్టానం మరియు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని రాజకీయా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.




