Rajgopal Reddy: కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి బాంబ్.. సీఎం రేవంత్ శైలి నచ్చలేదు.. షో అప్లు ఎక్కువయ్యాయి
Rajgopal Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rajgopal Reddy: కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి బాంబ్.. సీఎం రేవంత్ శైలి నచ్చలేదు.. షో అప్లు ఎక్కువయ్యాయి
Komatireddy Rajgopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రోజురోజుకు కనుమరుగవుతున్నారని రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఎక్కడెక్కడి నుంచో కొత్తవాళ్లు వచ్చారు... ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో అంతా వాళ్లదే నడుస్తోంది" అంటూ వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన పరోక్షంగా ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్‌గానే పెదవి విరిచారు. "సీఎం వ్యవహారశైలి నాకు అస్సలు నచ్చలేదు. ప్రభుత్వంలో పని కంటే షో అప్స్ (హంగామా) ఎక్కువయ్యాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి ధర్మకర్తల మండలి (బోర్డు) ఏర్పాటు లేదా సమీక్షల విషయంలో స్థానిక సీనియర్ నేతగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. "నేను సీనియర్ నేతను, ఎమ్మెల్యేను.. అలాంటిది యాదగిరిగుట్ట విషయంలో నాకు కనీసం చెప్పకపోతే ఎలా? ఈ వ్యవహారాలు నచ్చకే నేను ఉద్దేశపూర్వకంగానే నల్లగొండ సభకు హాజరుకాలేదు" అని తన గైర్హాజరీకి గల కారణాన్ని స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య ఉన్న అసంతృప్తిని బట్టబయలు చేశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అధిష్టానం లేదా సీఎం వర్గం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.




