Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్‌ను విమర్శించలేదు.. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఉంటా
Komatireddy Rajgopal Reddy: పార్టీలో బయట వ్యక్తుల పెత్తనంపై చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తానేమీ పార్టీకి వ్యతిరేకం కాదని, అసలైన కార్యకర్తలు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలనే మాట్లాడానని స్పష్టం చేశారు.
Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్‌ను విమర్శించలేదు.. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఉంటా
Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందంటూ తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ సంచలనం రేపిన వేళ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు.
తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, పార్టీని కానీ విమర్శించలేదని... భవిష్యత్తులో కూడా విమర్శించబోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. "తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కూడా ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను" అని తేల్చిచెప్పారు.
పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా జెండా మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రస్తుత ప్రజాపాలనలో తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని ఆయన వెల్లడించారు. సీమాంధ్ర పాలకులు, కాంట్రాక్టర్ల చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ నడవకూడదని సూచించారు. ప్రజాపాలన అంటే కేవలం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదని... పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేయాలని స్పష్టం చేశారు.




