Kishan Reddy: సింగరేణిని రాజకీయాల కోసం వాడుకున్నారు.. కేసీఆర్‌పై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్లే సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 27 July 2026 5:17 PM IST
Kishan Reddy
X

Kishan Reddy: సింగరేణిని రాజకీయాల కోసం వాడుకున్నారు.. కేసీఆర్‌పై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు!  

Kishan Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వింత ప్రవర్తన, మొండి వైఖరి వల్లే తెలంగాణకు తలమానికమైన సింగరేణి తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగట్టారు.

2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఆధారంగా బొగ్గు గనులను పారదర్శకంగా వేలం పాట ద్వారా కేటాయించాలని ఆదేశించినప్పటికీ, నాటి కేసీఆర్ ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొనకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కొత్త బొగ్గు బ్లాకులు లభించక, ఆదాయ మార్గాలు మూసుకుపోయి సింగరేణి వెనుకబడిపోవడానికి కేసీఆర్ చేసిన ద్రోహమే కారణమని ఆరోపించారు.

గత ప్రభుత్వం సింగరేణిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 525 కోట్ల నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోయిందని దుయ్యబట్టారు.

2015లోనే ఒడిశాలోని ‘నైని కోల్ బ్లాక్‌’ను కేంద్రం సింగరేణికి కేటాయించినప్పటికీ, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఒడిశా ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేదని గుర్తుచేశారు. అయితే, ఇటీవల ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము ప్రత్యేక చొరవ తీసుకుని నైని కోల్ బ్లాక్‌కు అవసరమైన అన్ని రకాల అనుమతులను ఇప్పించినట్లు వెల్లడించారు.

సింగరేణి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి.. తాడిచర్ల-2 బ్లాక్‌ను కూడా సంస్థకు కేటాయించామని, మణుగూరులోని మరొక బ్లాక్‌ను వేలంలో ఉంచామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story