Kavitha: జెన్ జీ నే మా టార్గెట్ : కవిత
Kavitha: తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ‘సర్వోదయ తెలంగాణ’ నినాదంతో కొత్త శక్తి రంగప్రవేశం చేసింది.
Kavitha
Kavitha: తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ‘సర్వోదయ తెలంగాణ’ నినాదంతో కొత్త శక్తి రంగప్రవేశం చేసింది. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను వెల్లడించారు. రెండు దశాబ్దాల పాటు సామాజిక, సాంస్కృతిక సేవలో ఉన్న తెలంగాణ జాగృతి సంస్థ ఇకపై పూర్తిస్థాయి స్వచ్ఛంద సంస్థగా (ఎన్జీవో) మాత్రమే పనిచేస్తుందని, రాజకీయ పోరాటాల కోసం ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పేరుతో ప్రజాక్షేత్రంలోకి దూకుతున్నామని ఆమె ప్రకటించారు. ప్రధానంగా నేటి తరం యువత (జెన్ జీ) ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ కొత్త రాజకీయ శక్తి ప్రస్థానం సాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
‘పాంచజన్యం’ పేరుతో ఐదు సూత్రాల అజెండా
ప్రస్తుత పాలనపై నిప్పులు చెరుగుతూనే ‘పాంచజన్యం’ పేరుతో ఐదు సూత్రాల కార్యాచరణను కవిత వివరించారు. అధర్మంపై యుద్ధం చేయడానికి శ్రీకృష్ణుడు మోగించిన శంఖమే స్ఫూర్తిగా, తెలంగాణలో అణచివేతపై గళమెత్తడానికి ఈ పేరును ఎంచుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ మొదటి ప్రాధాన్యతని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా వారు చదివేంత వరకు పూర్తి ఉచిత విద్యను అందించడమే తమ పార్టీ లక్ష్యమని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం కోసం సగటు మధ్యతరగతి కుటుంబం తన ఆదాయంలో అరవై శాతం ఖర్చు చేస్తోందని, ఆ భారాన్ని తొలగించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని ఆమె ఉద్ఘాటించారు.
నిరుద్యోగులకు భరోసా.. లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలు
యువతకు ఉపాధి కల్పన విషయంలో వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నట్లు కవిత వెల్లడించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా, యువతను ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందుకు గాను ఇరవై ఐదు నుండి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు వారి ఆలోచనల మేరకు రెండు లక్షల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందని, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తూనే, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునేలా లక్ష ‘సూపర్ న్యూమరికల్’ పోస్టులను సృష్టిస్తామని సంచలన హామీ ఇచ్చారు. అగ్రవర్ణ పేదలు, వికలాంగులు , మాజీ సైనికులకు ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని వివరించారు.
‘సీఎం సిమ్ కార్డు ఢిల్లీలో ఉంది’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నప్పటికీ ఆయన సిమ్ కార్డు మాత్రం ఢిల్లీలో ఉందని, అంటే ఇక్కడి పాలన మొత్తం ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లు , ఓవర్ సీస్ స్కాలర్‌షిప్‌ల హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ప్రాణాలు విడుస్తున్నా పాలకులకు చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సెక్రటేరియట్‌లో దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేయి రోజుల పోరాటం.. గమ్యం అధికారమే!
తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం కేవలం మాటలకే పరిమితం కాదని, వచ్చే వెయ్యి రోజుల పాటు క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైందని, కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ‘అమ్మలాంటి పాలన’ అందించడమే తమ అంతిమ లక్ష్యమని, దీని కోసం టీఆర్ఎస్ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేస్తాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చెప్పిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.




