కవిత ‘TRS’ పార్టీ పేరుకు ఈసీలో బ్రేక్.. సోలాపూర్ నేత దరఖాస్తుతో కొత్త ట్విస్ట్!
TRS: కల్వకుంట్ల కవిత స్థాపించబోయే ‘TRS’ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరుకు ఊహించని బ్రేక్ పడింది.
కవిత ‘TRS’ పార్టీ పేరుకు ఈసీలో బ్రేక్.. సోలాపూర్ నేత దరఖాస్తుతో కొత్త ట్విస్ట్!
TRS: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు చుట్టూ ఇప్పుడు పెద్ద ‘టైటిల్ వార్’ (Title War) నడుస్తోంది. కవిత ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) అనే పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వద్ద ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఇటీవల పేపర్లలో కవిత తరఫున ఇచ్చిన పబ్లిక్ నోటీసు (యాడ్) పై ఇప్పుడు ప్రజా అభ్యంతరాలు, రాజకీయ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒక్క రోజు ముందే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న "తెలంగాణ రాష్ట్రసామాజిక సేన" (TRS) అనే పార్టీ ఇదే పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సోలాపూర్‌కు చెందిన నేత దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ పేరు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రెండు పార్టీల సంక్షిప్త నామం ‘TRS’ ఒక్కటే కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద అసలైన వివాదం మొదలైంది.
మరోవైపు కవిత పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారత్ రాష్ట్ర సమితి (BRS) అధికారికంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు దాఖలు చేసింది. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 'TRS' (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని 'TRS' గానే గుర్తిస్తారని, కాబట్టి ఆ అక్షరాలను (Short Name) మరే ఇతర కొత్త పార్టీకి కేటాయించవద్దని ఈసీఐకి గులాబీ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి.
కవిత వాడుతున్న 'TRS' అక్షరాలపై కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న 'తెలంగాణ రాజ్య సమితి' (TRS) అనే పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తంగా కవిత 'TRS' పేరును వాడుకోవడంపై ఈసీఐకి దాదాపు 600 నుండి 700 వరకు విభిన్న ప్రజా అభ్యంతరాలు అందడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఈసీ వద్ద ఇప్పటికే ఈ సంక్షిప్త నామంతో మరో రెండు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నట్లు సమాచారం.
ఈ టైటిల్ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వివరణ కోరనుండటంతో, దానికి తగిన సమాధానాలు ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం ఢిల్లీలో సిద్ధమవుతోంది. భారీ ఎత్తున చట్టపరమైన మరియు రాజకీయ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కవిత కొత్త పార్టీకి 'TRS' అనే క్రేజీ పేరు దక్కుతుందా? లేక ఈసీ సూచనల మేరకు పేరు మార్చుకోవాల్సి వస్తుందా? అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.




