Kalvakuntla Kavitha: ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదు!
Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ బహిష్కరణ, నూతన పార్టీ ‘తెలంగాణ రక్షణసేన’ ఆవిర్భావం, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు, బీసీలకు 50% రిజర్వేషన్ల డిమాండ్‌పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.
Kalvakuntla Kavitha: ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదు!
Telangana Rakshana Sena: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్‌ను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యం కాదని స్పష్టం చేస్తూనే, తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ సిద్ధాంతాలు, బీఆర్ఎస్ నుంచి బహిష్కరణపై ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగంగా, అంతకుమించి వ్యూహాత్మకంగా మాట్లాడారు.
తనకు సమాజంలో ఉన్న గుర్తింపంతా తండ్రి కేసీఆర్ వల్లే వచ్చిందని అంగీకరిస్తూనే, బీఆర్ఎస్ నుంచి తనను పక్కన పెట్టడంపై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్‌కు ఏడాది ముందు నుంచే తనను పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా పెట్టారని, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా బయటకు పంపారని ఆమె ఆరోపించారు. పార్టీ నుంచి తొలగించినప్పటికీ, నైతిక విలువలకే కట్టుబడి తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు గుర్తుచేశారు.
ఇంట్లో గానీ, పార్టీలో గానీ ఎవరితోనూ తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, ఇప్పటివరకు తండ్రిని ఎదురించిన చరిత్ర తనకసలే లేదన్నారు. తమ నూతన పార్టీ ‘తెలంగాణ రక్షణసేన’కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.
మాది ఏదో ఆర్ట్ సినిమా కాదు, పక్కా కమర్షియల్ మూవీ. మా రాజకీయ విధానం నచ్చి ఎందరో మద్దతు ఇస్తున్నారు. నేను గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారు? అని ప్రశ్నించారు. పార్టీ ప్రారంభ సమయంలో తనను వైఎస్ షర్మిలతో పోల్చడాన్ని ఆమె తోసిపుచ్చారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రను తిరగరాసినట్లే, తాను కూడా ఒక నూతన చరిత్రను సృష్టిస్తానని స్పష్టం చేశారు.
వ్యక్తిగత సంబంధాలకు, రాజకీయ సిద్ధాంతాలకు ముడిపెట్టనని కవిత స్పష్టమైన గీత గీశారు. వ్యక్తిగతంగా కుటుంబంతో బంధం కొనసాగినా, రాజకీయంగా బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని, ప్రాణం ఉన్నంతవరకు ఆ పార్టీతో కలిసి పనిచేయనని స్పష్టం చేశారు. అయితే, బీఆర్ఎస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ఏకైక సిద్ధాంతం కాదని కుండబద్ధలు కొట్టారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో బిడ్డల అమరత్వానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని, ప్రధాన పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో విస్మరించారని ఆరోపించారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఢిల్లీ పీఠంతో యుద్ధానికైనా సిద్ధమేనని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం, లౌకికవాదమే తమ మూల సిద్ధాంతాలని, కేవలం 100 రోజుల్లోనే 42 నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేసి క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు తమ తెలంగాణ రక్షణసేన గట్టి పోటీనిస్తుందని, తమ అసలు ఓటుబ్యాంకు ఏంటో త్వరలోనే రుజువు చేస్తామని కవిత ధీమాతో ఉన్నారు.




