Telangana High Court: సెక్షన్ 8B ఉల్లంఘన.. కాళేశ్వరం కేసులో కొత్త ట్విస్ట్!

Telangana High Court: కాళేశ్వరం విచారణ కమిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనన్న కోర్టు.. నివేదికలోని ఫైండింగ్స్‌పై స్టే. సెక్షన్ 8B ఉల్లంఘన జరిగిందని వ్యాఖ్య. పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 23 April 2026 11:25 AM IST
Telangana High Court
X

Telangana High Court: సెక్షన్ 8B ఉల్లంఘన.. కాళేశ్వరం కేసులో కొత్త ట్విస్ట్!

Telangana High Court: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి ఒక రకంగా ఊరటనిస్తూనే, మరోవైపు కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలపై కోర్టు బ్రేక్ వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తీర్పులోని ప్రధానాంశాలు ఇవే:

1. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే!

కాళేశ్వరం అవినీతిపై విచారణ కోసం ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.6 (14-03-2024) చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం కాదని, ప్రభుత్వానికి విచారణ జరిపించే అధికారం ఉందని తీర్పునిచ్చింది. ఇది ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.

2. నివేదికపై కోర్టు సీరియస్ - సెక్షన్ 8B ఉల్లంఘన!

కమిషన్ ఇచ్చిన ఫైండింగ్స్‌పై (నిర్ధారణలు) హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణలో సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ చట్టంలోని సెక్షన్ 8B నిబంధనల ప్రకారం, ఎవరిపైనైనా ఆరోపణలు చేసే ముందు వారికి నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలి. అయితే ఈ కేసులో పిటిషనర్లకు ఆ అవకాశం ఇవ్వకుండానే నివేదిక ఇచ్చారని కోర్టు అభిప్రాయపడింది.

3. ఆ భాగాలు అమల్లో ఉండవు!

పిటిషనర్ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న నివేదికలోని ఆ భాగాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఫైండింగ్స్ ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని కోర్టు స్టే విధించింది.

ఈ తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మిశ్రమ ఫలితం దక్కినట్లయింది. కమిషన్ కొనసాగింపునకు లైన్ క్లియర్ అయినా.. ఇప్పటివరకు కమిషన్ ఇచ్చిన కీలక నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇప్పుడు చట్టపరంగా మరోసారి నోటీసులు ఇచ్చి ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story