హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ: ఏటీఎంలో సిబ్బంది ఉండగానే రూ.17 లక్షలు మాయం!

Hyderabad: హైదరాబాద్ ఐఎస్ సదన్ (IS Sadan) లో భారీ చోరీ జరిగింది.

Arun Chilukuri
Published on: 23 Jun 2026 5:13 PM IST
హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ: ఏటీఎంలో సిబ్బంది ఉండగానే రూ.17 లక్షలు మాయం!
X

హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ: ఏటీఎంలో సిబ్బంది ఉండగానే రూ.17 లక్షలు మాయం!

Hyderabad: నగరంలోని ఐఎస్ సదన్ (IS Sadan) పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో నింపడానికి తీసుకొచ్చిన రూ.17 లక్షల భారీ నగదును దుండగులు అత్యంత చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ దోపిడీ నగరంలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒక ఏటీఎంలో డబ్బులు నింపేందుకు (Cash Loading) సిబ్బంది ఒక ప్రైవేట్ క్యాష్ వ్యాన్‌లో అక్కడికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది మరియు క్యాష్ లోడింగ్ సిబ్బంది రూ.17 లక్షల నగదు ఉన్న ట్రంకు పెట్టెను వ్యాన్ లోనే ఉంచి, ప్రాథమిక తనిఖీల కోసం ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లారు. అదే సమయం కోసం మాటు వేసిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు.. క్షణాల వ్యవధిలో వ్యాన్‌లో ఉన్న సదరు నగదు పెట్టెను లాగేసి, బయట సిద్ధంగా ఉంచుకున్న బైక్‌పై పెట్టుకుని మెరుపు వేగంతో పరారయ్యారు.

ఈ దారుణ ఘటన జరిగిన కొద్దిసేపటికే కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. దోపిడీ జరిగిన తర్వాత సదరు ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ కూడా అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. సిబ్బంది బయటకు వచ్చి చూసేసరికి అటు డబ్బుల పెట్టె, ఇటు డ్రైవర్ ఇద్దరూ లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ చోరీ వెనుక కంచె చేను మేసిన చందంగా.. క్యాష్ వ్యాన్ డ్రైవరే కీలక సూత్రధారి అయి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ ముందే ప్లాన్ వేసుకుని, తన సహచరులతో కలిసి ఈ దోపిడీకి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం క్లూస్ టీమ్, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఏటీఎం పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నాయి. పరారీలో ఉన్న డ్రైవర్ మరియు దుండగుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story