HFAST Raids : హైదరాబాద్ స్వీట్స్ సెంటర్లలో బయటపడిన దారుణాలు.!
HFAST Raids : హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. బిర్యానీ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తర్వాత ఈసారి అధికారుల నజర్ బేకరీ
hyderabad food safety raids
HFAST Raids : హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. బిర్యానీ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తర్వాత ఈసారి అధికారుల నజర్ బేకరీ ఐటమ్స్, స్వీట్ల తయారీ కేంద్రాలపై పడింది. నగరవ్యాప్తంగా ఉన్న పలు స్వీట్లు, కేకులు, కుకీలు , హైదరాబాద్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ప్రసిద్ధ ఒస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రాలపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ (H-FAST) అధికారులు అకస్మాత్తుగా మెరుపు దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) దైవనిధి ఆధ్వర్యంలో జరిగిన ఈ విస్తృత తనిఖీల్లో పలు ప్రసిద్ధ తయారీ కేంద్రాలు సైతం కనీస నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు తేలింది.
కంపుకొడుతున్న తయారీ కేంద్రాలు.. ఈగలు, పురుగుల హల్‌చల్
ఈ దాడుల సందర్భంగా తయారీ కేంద్రాల లోపల ఉన్న పరిస్థితులను చూసి అధికారులు సైతం విస్తుపోయారు. ఏమాత్రం పరిశుభ్రత లేని వాతావరణం, మురికిగా మారిన కిచెన్ ఏరియాలు, నిల్వ ఉంచిన ముడి పదార్థాల వద్ద ఈగలు, పురుగులు, కీటకాలు తిరుగుతుండటాన్ని అధికారులు గమనించారు. ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేకరీ ఐటమ్స్, బిస్కెట్లు, స్వీట్లను అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా ఇక్కడ గాలికొదిలేశారు.
కాలం చెల్లిన పదార్థాలు.. లైసెన్స్ ఉల్లంఘనలు
కేవలం అపరిశుభ్రతే కాకుండా, మరికొన్ని యూనిట్లలో కాలం చెల్లిన రంగులు, ఫ్లేవర్లను వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల ప్యాక్ చేసిన స్వీట్లు, బిస్కెట్ బాక్సులపై తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ వంటి ఎలాంటి వివరాలు ముద్రించకుండానే మార్కెట్లోకి సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. మరికొన్ని కేంద్రాలకైతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ గడువు ముగిసినా, పాత వాటితోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు సాగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ఆహార పదార్థాలను తయారు చేయాలనే నిబంధనలను ఉల్లంఘించిన సదరు యాజమాన్యాలపై అధికారులు ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఏ ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌ను వదిలిపెట్టేది లేదని, నిర్దేశిత నిబంధనలు పాటించని వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడిన కేంద్రాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు, భారీ జరిమానాలు విధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ప్రజారోగ్యమే ముఖ్యం
నగర ప్రజల ప్రజారోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. వినియోగదారులకు అందే ప్రతి ఆహార పదార్థం సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంలో తయారయ్యేలా చూడటానికే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ దాడులు మరింత ముమ్మరం చేస్తామని, ఎక్కడైనా కల్తీ లేదా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తే ప్రజలు నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.




