Hyderabad: అనుమానంతో ఘోరం.. భార్యను కిరాతకంగా చంపిన భర్త!

Hyderabad: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఘోరం జరిగింది. ఆలస్యంగా ఇంటికొస్తోందనే అనుమానంతో భార్యను భర్త కిరాతకంగా నరికి చంపాడు.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 10:39 AM IST
Hyderabad
X

Hyderabad: అనుమానంతో ఘోరం.. భార్యను కిరాతకంగా చంపిన భర్త!

Hyderabad: భార్యపై పెంచుకున్న అనుమానం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. "నాన్నా.. అమ్మను చంపొద్దు" అంటూ కన్నబిడ్డ కళ్లెదుటే వేడుకుంటున్నా.. ప్రాణభయంతో ఆ ఇల్లాలు పరుగెడుతున్నా కరుణ లేకుండా ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్డుతో దాడి చేసి భార్యను నడిరోడ్డుపై అంతమొందించాడు. ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి తేజస్వీనీనగర్‌లో చోటుచేసుకుంది.

అత్తాపూర్‌ ఎస్సై పార్వతి తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్‌ దంపతులకు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. అత్తాపూర్‌ తేజస్వీనినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోమలి కాపలాదారుగా (వాచ్‌మెన్‌) చేరుతూనే, అదే భవనంలోని పలు ఇళ్లలో పని మనిషిగా చేస్తోంది. భర్త అవినాష్‌ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

వివిధ ఇళ్లలో పనిచేసే క్రమంలో కోమలి ఆలస్యంగా ఇంటికి వస్తోందనే కారణంతో అవినాష్‌ ఆమెపై కొద్దిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి అవినాష్‌ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. శుక్రవారం తెల్లవారుజాము వరకు వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అవినాష్‌.. ఇంట్లో ఉన్న కత్తితో కోమలిపై దాడికి తెగబడ్డాడు.

తండ్రి కత్తితో దాడి చేయడాన్ని గమనించిన పెద్ద కుమారుడు.. "నాన్నా.. అమ్మను చంపొద్దు" అంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఆ ఉన్మాది కనికరించలేదు. ఈ లోపు అతని బారి నుంచి తప్పించుకున్న కోమలి, ప్రాణభయంతో కేకలు వేస్తూ అపార్ట్‌మెంట్ వెలుపలికి పరుగెత్తింది. అవినాష్‌ కత్తితో ఆమెను వెంబడించాడు. పరుగెత్తే క్రమంలో చేతిలోని కత్తి జారిపోవడంతో, అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో ఆమె శరీరంపై ఇష్టానుసారంగా పొడిచాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో తలపై బాదాడు.

కోమలి ఆర్తనాదాలు విన్న అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో అవినాష్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన కోమలిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె కొద్దిసేపటికే కన్నుమూసింది. సమాచారం అందుకున్న అత్తాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు అవినాష్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పార్వతి వెల్లడించారు. కళ్ల ముందే తల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story