CP Sajjanar: హైదరాబాద్‌లో కల్తీ మసాలాల గుట్టురట్టు.. 25 టన్నులు సీజ్!

CP Sajjanar: హైదరాబాద్‌లో కల్తీ మసాలాల కేంద్రాలపై H-FAST మెరుపు దాడులు. 25 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్.

Arun Chilukuri
Published on: 4 Aug 2026 12:30 PM IST
CP Sajjanar
X

CP Sajjanar: హైదరాబాద్‌లో కల్తీ మసాలాల గుట్టురట్టు.. 25 టన్నులు సీజ్!

CP Sajjanar: రాజధాని నగరంలో ప్రజల ఆరోగ్యాన్నే వ్యాపారంగా మలుచుకుంటూ కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని 'H-FAST' (హైదరాబాద్ ఫుడ్ యాంటీ అడల్టరేషన్ స్పెషల్ టీమ్) ఉక్కుపాదం మోపింది. ప్రజల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.

వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా అనేక రకాల మసాలాల్లో విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మసాలాలు ఆకర్షణీయంగా, మెరుస్తూ కనిపించడం కోసం టాల్కమ్ పౌడర్, హానికర రసాయనాలు, ఇండస్ట్రియల్ డైలు, ఫ్యాబ్రిక్ కలర్స్ మరియు సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నాసిరకం ఉత్పత్తులకు రంగులు అద్ది నాణ్యమైన మసాలాలుగా మార్కెట్లో అమ్ముతున్నారని తెలిపారు.

ఈ దాడుల్లో సుమారు 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, అలాగే తయారీకి ఉపయోగించే 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 3 కేసులు నమోదు చేయగా, ఈ వ్యవహారంలో ప్రధానంగా ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను తదుపరి విచారణ నిమిత్తం ల్యాబ్ పరీక్షలకు పంపించినట్లు పేర్కొన్నారు.

ఇలాంటి హానికర రసాయనాలతో తయారుచేసిన కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్, తీవ్రమైన అలర్జీలు మరియు జీర్ణకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కల్తీ రాయుళ్లపై ఆహార భద్రత చట్టం (Food Safety Act) కింద అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

H-FAST బృందం ఏర్పాటైన కేవలం 140 రోజుల్లోనే 659 ప్రాంతాల్లో ముమ్మర దాడులు నిర్వహించిందని, ఇప్పటివరకు 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 246 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేశామని సీపీ వివరించారు. నగరంలో ఎక్కడైనా కల్తీ ఆహారం లేదా అనుమానాస్పద తయారీ కేంద్రాలు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story