Medchal: హెచ్ఐవీ రక్తం కేసులో విషాదాంతం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

Medchal: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో విషాదం. ఉన్మాది మనోహర్ బలవంతంగా హెచ్ఐవీ రక్తం ఎక్కించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది.

Arun Chilukuri
Published on: 10 April 2026 2:23 PM IST
Medchal
X

Medchal: హెచ్ఐవీ రక్తం కేసులో విషాదాంతం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

Medchal: ప్రేమ ఉన్మాదానికి బలైన ఓ యువతి, జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి నిరాకరించిందని కక్షతో తన శరీరంలోకి హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించిన ఉన్మాది చేష్టలకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

జనగామ జిల్లాకు చెందిన మనోహర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వరుసకు మరదలు అయ్యే యువతిని అతను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు యువతి తండ్రి మనోహర్‌కు హెచ్ఐవీ పరీక్షలు చేయించగా, అందులో అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారు.

గత నెల 11న పెళ్లి చేసుకోవాలని మనోహర్ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో, తన వద్ద ఉన్న హెచ్ఐవీ సోకిన రక్తాన్ని సిరంజి ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించాడు. ఆ తర్వాత యువతికి పరీక్షలు చేయగా ఆమెకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పోలీసులు నిందితుడు మనోహర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

బాధిత యువతి అప్పటి నుండి తీవ్ర మానసిక కుంగుబాటుకు (Depression) గురైంది. తన జీవితం నాశనమైందన్న ఆవేదనతో ఉన్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story